Friday, July 23, 2010

పరమ గురు చరణ సన్నిధి-వివేకం

(కొనసాగింపు)

ఇట్లా నిశ్చయించిన వెనుకను, సదసత్తులలో అనేక భేదాలు వున్నాయని మరువవద్దు. సరి ఇది అని, తప్పు ఇది అని, ముఖ్యమీది అని, అముఖ్యమిది ని, ఉపయోగకరమిది అని, వ్యర్ధమిది అని, సత్యమిది అని, అనృత మిది అని, స్వప్రయోజనమిది అని, పరోపకారమిది అని వివేకం తో తెలుసుకొనుట ఇంకా మిగిలే వుంటుంది.

తప్పును విడిచి సరియైన దానిని అవలంబించటం కష్టం గా తోచరాదు. ఎందుకంటే పరమ గురువును అనుసరించుగోరు వారు ఎన్ని కష్టాలైనా పడి, సరి అయిన దానినే అవలంబించాలని ముందే నిశ్చయం చేసుకొని వుంటారు.

అయినా ఈ శరీరం వేరు, నీవు వేరు. నీ ఇచ్చ ఎల్లప్పుడూ నీ శరీరం కోరు దానిని అనుసరించి వుండదు.

ఈ శరీరం ఏదైనా కోరినచో అది యథార్థంగా నీవు కోరునది అగునా అని నిలిచి యోచింపుము. నీవీశ్వరుడివే. ఈశ్వరుడిచ్చయించునదియే నీవును నిచ్చాయింతువు, గాని నీవు నీ యంతరంగమును లోతున దిగి శోధించి నీలో నుండు ఈశ్వరుని కనుగొని ( ఒకానొక ధీరుడు అమృతత్వమును కోరినవాడై దృష్టిని లోపలకు త్రిప్పి ప్రత్యగాత్మ ను ( లోపల నుండు ఆత్మను ) చూచును ---కఠోపనిషత్తు) వాని మాటను తెలిసికొనవలయును సుమా! అది నీ మాట.

నీ శరీరములే నీవను పొరపాటుపడకు.స్థూల శరీరం నీవు కావు. కామమయ శరీరం నీవు కావు.( ఈ కామమయ, మనోమయ శరీరములు రెండూ చేరి మనోమయ కోశమని వేదాంతులు చెప్తారు) మనోమయ శరీరం నీవు కావు. ఇవి ఒకొక్కటి తనకు కావలసిన దానిని పొండటానికి తానే ఆత్మ అని నటించును. అయినా వానినన్నింటిని తెలుసుకొని వానికన్నింటికి స్వామి నీవని యెరుగుము. (ఈ శరీరమునకు క్షేత్రమని పేరు. దీనిని తెలుసుకొనువాడు క్షేత్రజ్నుడు (జీవుడు) అని తెలిసినవారు చెప్పుదురు ---గీతా)

చేయవలసిన పని యుండగా శరీరం శ్రమ తీర్చుకోవాలి గాని, తిరుగబోవాలని గాని , భోజనపానములు చేయాలని గాని కోరును. తెలియని వాడు,' ఇవి అన్నీ నేను గోరేదను, నేను వీనిని చేయాలి ' అనుకుంటాడు. తెలిసినవాడు ' వీనిని కోరునది నేను కాదు. ఇది కొంత కాలమట్లుండనిమ్ము' ఏనును. ఎవరికైనా సహాయం చేయుటకు అవకాశం కలిగినప్పుడు శరీరం ' అది నాకెంతో శ్రమ, మరియెవరైనా చేయుదురు గాక' అని పలుమార్లు తలంచినను ' మంచిపని చేయటానికి నీవడ్డు రాకుము' అని వాడు శరీరమునకు ప్రత్యుత్తరమిచ్చును.

దేహం నీకు వాహనం, నీవెక్కు గుర్రం. కావున దానిని ఆదరించి చక్కగా కాపాడాలి. దానికి శక్తికి మించిన పని ఇయ్యరాదు. దానికి పరిశుద్ధములగు అన్నపానములనే ఇచ్చి మేపాలి. లేశ మాత్రమైనా మైల లేక ఉండునట్లతి అతి పరిశుద్ధంగా నెల్లప్పుడూ వుంచాలి. పరిశుద్ధియు, ఆరోగ్యం ను పూర్ణంగా వుండు శరీరం లేనిచో, నీవు విరామము లేని శ్రమకు వోర్చి ఈ కఠినమగు సాధనం చేయజాలవు. ఎట్లన నీ శరీరం నీకు ఎల్లప్పుడును లోబడి వుండవలెను గాని నీవు శరీరమునకు లోబడి యుండరాదు.

కామమయ శరీరానికీ దాని కోరికలుంటాయి. అవి అనేకం. నిన్ను కోపించుకొమంటుంది. పరుష వాక్కులు ఆడమంటుంది. ధనమునకై పేరాశ పాడమంటుంది. ఇతరులకు వుండేది చూచి యోర్వకుండమంటుంది. ఖిన్నుడవై పరవశతనొంద మంటుంది. వీనిని కాక మరి అనేక కోరికలు కోరుతుంది. ఇట్లా కోరుట నీకు కీడు చేయాదలచి కాదు. ఇట్టి బలమగు తాకులు తాకుటయు, సారి సారికీ తాకులు మారు చుండుటయుదానికిష్టం. ఇవి యొక్కటియు నీకేమో అక్కరలేదు. కావున నీ కోరికలలో నీవి యేవి, నీ శరీరం కోరికలేవీ అని వివేచనం చేయాలి.

No comments: