Wednesday, July 21, 2010

గురువు ఆవశ్యకత గురించి వివేకానందుడి వాణి

ప్రతి జీవి పరిపూర్ణత గాంచటం విధాయకం. పర్యవసానం లో ప్రతి ప్రాణి పరిపూర్ణత పొందుతుంది. మన వర్తమాన స్థితి, మన పూర్వ కర్మం, మన పూర్వాలోచనల ఫలితం; ఇలాగే మన భావి స్థితి ప్రస్తుత కర్మలకూ, భావాలకు ఫలితం. కానీ ఇలా మన భావి స్థితి ని నిర్మించుకోవటం మనలను పరుల సాయం పొందనివ్వక అడ్డదు; అంతే కాదు, అనేకులకు అలాంటి సాయం అవశ్యం కావలసి వుంది. అది లభించినప్పుడు ఆత్మ శక్తి సామర్ధ్యాలు ఉద్దీపితాలవుతవి. పారమార్ధిక జీవితం ప్రబోధ మందుతుంది. అభివృధ్ధికి చురుకు కలుగుతుంది. చివరకు మానవుడు పావనుడై పరిపూర్ణత పొందుతాడు.

ఈ ఉద్దీపన శక్తిని పుస్తకాల నుంచి పొందలేము. ఆత్మ మరొక ఆత్మ నుంచి ప్రేరణ పొందుతుంది; వేరే మార్గం అసాధ్యం; యావజ్జీవం గ్రంధపఠనం చేస్తాం గాక, మహా మేధావిధులమవుతాం గాక. కానీ చివరకు మనం రవంత కూడా ఆత్మ వికాసం పొందలేదని మనకే తెలుస్తుంది. ధీవికాసం పొందే దానికి అనురూపమైన ఆధ్యాత్మికోన్నతి లభిస్తుందనుకోటం సత్యదూరం. గ్రంధపఠనం లో మనం పారమార్ధిక సహాయం పొందుతున్నామని ఒకొక్కప్పుడు భ్రమిస్తుంటాము; కానీ గ్రంధ పఠనం వల్ల మనకు కలిగే ప్రతిఫలాన్ని పరికిస్తే చివరకు దానివల్ల కొంచెమో, గొప్పో లాభం పొందటం కేవలం మన ధీశక్తికి కలుగుతోంది. కానీ అంతరాత్మకు కలగటం లేదని మనకు వెల్లడి అవుతుంది .

ఆధ్యాత్మిక విషయాలను గురించిదాదాపుగా ప్రతి వ్యక్తీ అత్యద్భుతం గా మాట్లాడగలిగీ , అనుష్టానానికి నిజమైన పారమార్ధికాచరణానికీ వచ్చేసరికి, ఎంత శోచనీయం గా వెనుకబడి వుంటామో మనం ఎరుగనిది కాదు. ఈ వ్యత్యాసానికి కారణం గ్రంధ పఠనం ఆత్మ వికాసానికి పెంపొందింప చేయకపోవటమే అని చెబుతాను. ఆత్మ జ్యోతి ని ఉద్దీప్తం చేయాలంతే తగిన ప్రేరణ శక్తి మరొక ఆత్మ నుంచి ప్రసరించి తీరాలి.
ఇలాంటి ప్రేరణ శక్తి ఎవరిలో నుంచి ప్రసరిస్తుందో అతడే గురువు. దాన్ని గ్రహించేవాడే శిష్యుడు. ఇలా ఎవరినైనా ప్రేరేపించటానికి గురువు శక్తిని సంక్రమింపచేయగలవాడుగా వుండాలనటం మొదటి విషయం. రెండవది దాన్ని గ్రహించే వ్యక్తి అందుకు అర్హుడై వుండాలి. బీజం సజీవమై వుండాలి; క్షేత్రం సాగుచేయబడి సిద్ధంగా వుండాలి.ఇవి రెండూ చేకూరితే పారమార్ధిక చింత అనే సస్యం అత్యద్భుతంగా ఫలిస్తుంది. నిజమైన ధర్మ ప్రబోధకుడు ఆశ్చర్యకరమైన శక్తులు కలిగి వుండాలి. శ్రోత కూడా కుశలుడు లభించాలి. ఇలా ఇద్దరూ అద్భుత వ్యక్తులై అసాధారణులైనప్పుడు మాత్రమే దివ్యమైన ఆత్మ ప్రబోధం జరుగుతుంది. ఇలాంటి వారే నిజమైన ఆచార్యులు,నిజమైన శిష్యులు,నిజమైన జీజ్ణాసువులు. ఇతరులందరికీ జిజ్నాస అనేది వట్టి వినోదం, ఆట. వారి లో ప్రబోధం పొందేదీ రవ్వంత కుతూహలం, ప్రజ్వలించేది రవ్వంత వైజ్నానిక పిపాస.అంతే గాని వారు మత ధర్మ దిక్చక్రాంచలమ్ లో నిలబడి వున్నారు. అయినా ఇదీ కొంత ప్రయోజనకరమే; ఎందుకంటే కాలక్రమాన ఇది నిజమైన పారమార్ధిక జిజ్నాస అనే దాహాన్ని జనింప చేయవచ్చు; అంతే గాక క్షేత్రం సంసిద్ధమవగానే బీజం వచ్చి పడుతుంది, పడి తీరుతుంది; ఇది మనకు అగోచరమైన ప్రకృతి శాసనం. ఆంతరంగం లో నిజమైన జిజ్నాస జనించగానే అలాంటి వ్యక్తికి తోడ్పడటానికై జ్నాన ప్రదాత అయిన గురువు కనిపిస్తాడు, కనిపించి తీరుతాడు. తాత్విక తేజాన్ని ఆకర్షించుకునే శక్తి శిష్యుడి లో ధృడమై పరిపూర్ణత నొందగానే దాన్ని సఫలీకృతం చేసే శక్తి క్రమం గా లభించి తీరుతుంది.

కానీ భక్తి మార్గాన కొన్ని గొప్ప ప్రమాదాలున్నాయి. ఆచార్యుడి వల్ల తత్వాన్ని గ్రహించే శిష్యుడు తాత్కాలికావేశాన్ని- భావావేశాన్ని – నిజమైన జిజ్నాస గా భ్రమించవచ్చు. మన జీవితాల్లోనే దాన్ని మనం గమనించవచ్చు. మనం ప్రేమించిన వ్యక్తి ఒకడు మరణించటం ఎన్నోసార్లు తటస్థీస్తుంది, మన గుండె పగులుతుంది. సమస్తం నశించిపోతూందని మనకు తోస్తుంది; అంతకంటే నిత్యమూ ఉన్నతమూ అయినదేదైనా కావాలనిపిస్తుంది. ఇక మనం పారమార్ధికాసక్తులం కావాలని భావిస్తాం. కొన్ని రోజులు గడవగానే ఆ శ్మశాన వైరాగ్య తరంగం సమసిపోతుంది; ‘ ఎప్పటి కాలు ఎట్టెట్టే ‘ అన్నట్లు మళ్ళా పూర్వ స్థితి సంప్రాప్తమవుతుంది. ఇలాంటి క్షణిక భావావేశమే పారమార్ధిక జిజ్నాసగా మనమంతా తరచూ భ్రమపడుతుంటాం. కానీ ఇలా భ్రమపడుతున్నంత వరకూ యథార్థం,నిరంతరం అయిన పారమార్థిక పిపాస కలగదు; అలాంటి ప్రబోధమొనరించే నిజమైన ఆచార్యుడు లభించడు. కాబట్టి మన సత్యాన్వేషణమంతా నిష్ప్రయోజనమైనదని వాపోవ బుద్ధి మారినప్పుడల్లా, అలా వాపోవటానికి మారు, ఆత్మపరీక్ష చేసుకొని మనకు నిజమైన జిజ్నాస వుందా లేదా అని విచారించటం మన ప్రధమ కర్తవ్యం. అలా చేసినట్లయితే నూటికి తొంభై పాళ్ళు తత్త్వ జ్నానానికి మనకు ఇంకా అర్హత కలుగలేదనీ మన జిజ్నాస నిజమైనదీ కాదనీ వెల్లడవుతుంది.

తత్త్వోపదేశం చేసే గురువు విషయం లో ఇంత కంటే గొప్ప ప్రమాదాలున్నాయి. స్వయం గా అజ్నానపంక నిమగ్నులమై వుండీ గర్వాతిరేకం తో సర్వజ్నులమని విర్రవీగుతూ, అంతటితో ఆగక, పరులను తరింప చేయడానికై తమ భుజాలానందివ్వటానికి వెనుతియ్యక, కానన్న వారు కానన్నవారికి నాయకులై చివరకు వారూ వీరూ కలిసి గోతి లో పడుతూంటారు.

“ మూఢులు అజ్నానాంధకారం లో గోరాడుతూ, మా కంటే ధీరులు లేరని విర్రవీగుతూ , పండితమ్మన్యులై, గుడ్డివారి చేత నడపబడే గుడ్డివారి మాదిరి తొట్రుపాటు చెందుతూ పరిభ్రమిస్తుంటారు.” ప్రపంచం ఇలాంటి పండితమ్మన్యులతో నిండి వుంది. ప్రతి వ్యక్తికీ తాను ఆచార్యుణ్ణి కావాలనే తహతహ! ప్రతి యాచకుడికీ తాను పదిలక్షలు దానం చేయాలనే ఆవేదన! ఈ యాచకుల మాదిరే ఈ ఆచార్యులు నిజానికి హాస్యాస్పదులే.


( వివేకానందుడి “ భక్తి యోగం “ నుంచి....)

1 comment:

సురేష్ బాబు said...

గురుపూర్ణిమ దగ్గరపడుతుండగా మీ పోస్టు మంచి timely గా ఉంది. చాలా బాగా వ్రాసారు. ధన్యవాదాలు.