Thursday, July 22, 2010

పరమ గురు చరణ సన్నిధి


జిడ్డు కృష్ణమూర్తి రాసిన
'పరమ గురు చరణ సన్నిధి'
పుస్తకం నుండి....

ఉపోద్ఘాతం

ఇందులో రాసినవి నా మాటలు కావు. నాకుపదేశించిన పరమ గురువు మాటలు. వారు లేక పోతే నేనేమీ చేసి వుండలేను, గాని వారి సహాయము చే నేను మోక్ష మార్గమును ప్రవేశించాను. నువ్వు అదే మార్గం ప్రవేశింప ఇచ్చ గలవాడవు. కాబట్టి వారు నాకుపదేశించిన వాక్కులు నీకు కూడా సహాయంగా వుండును.ఆ మాటలను అనుష్టించాలి సుమా! ఆ మాటలు సత్యములని, రమణీయములని చెపితే సరిపోదు. చెప్పిన ప్రాకారం జవదాటక అనుష్టించిన గాని నువ్వు కడతేరజాలవు. ఆహారాన్ని చూచి అది బాగుగా వున్నదనుటచే ఆకలిగొన్న వాని ఆకలి తీరదు. చేయి చాచి ఆ అన్నం తినాలి కదా. అట్లానే పరమ గురువుల వాక్కులు వినటం చాలదు. వారు చెప్పే ఒక్కొక్క మాట గమనించి వారు సూచించు ఒక్కొక్క అంశాన్ని గ్రహించి వారు చెప్పినట్లు నడుచుకోవాలి. వారి సూచనల్లో ఒక్కటి గ్రహించకపోయినా, వారి మాటల్లో ఒక్కటి విడిచినా, అది యెప్పటికిని పోయినదే. వారు చెప్పినది మరల చెప్పారు సుమా.

ఈ మార్గమున నాలుగు సాధనాలున్నవి.
1. వివేకం. 2. నిష్కామత్వం ( విరాగం) 3. సదాచారం 4. ప్రేమ. వీనిలో ఒకొక్కదానిని గురించి నాకు పరమ గురువు ఏం ఉపదేశించారో దాన్ని మీకు చెప్తాను.

వివేకం

ఇందులో మొదటి సాధనం వివేకం. ఇది మోక్ష మార్గమున చేర్చు సదసద్వివేకమని కూడా అంటారు. ఇది సరియైనదే. అయినా దీని లో మరి కొంత గొప్ప విశేషముంది. ఆ మార్గారంభమునే కాదు, అడుగడుగునా ప్రతి దినం అభ్యసింపదగినది. పొండదగిన వస్తువులన్నీ ఆ మార్గమునే లభిస్తాయని నేర్చుకున్నావు కాబట్టే నువ్వు ఈ మార్గమున ప్రవేశించావు. తెలియని వారు ధనము గూర్చి, అధికారం కోసం పాటుపడతారు.కానీ అవి యెంత కాలం వున్న ఒక్క జన్మం లో విడిచిపోతాయి. కాబట్టి అవి అసత్తులు. సత్తులును, నిత్యములును అయి వీని కంటే అధికమైన వస్తువులు వున్నాయి. ఒక సారి చూస్తే నువ్వు ఇక ఇతర వస్తువులను కోరవు.

ప్రపంచం లోని మనుష్యులు రెండు రకాలు. తెలిసిన వారు, తెలియని వారు. ఈ తెలివి ఒక్కటే ముఖ్యమైనది. ఏ మతం అవలంబించు వాడు, ఏ జాతి వాడు అనేది ముఖ్యం కాదు. నిజంగా ముఖ్యమైనది ఈ జ్నానమే. మానవులను గురించి ఈశ్వరుడు చేసిన కట్టుబాటు ఇట్టిదని తెలిసుకోవటమే జ్నానం. భగవంతుడే అట్టి కట్టుబాటు చేసి వున్నాడు. అదే ప్రపంచ పురోవృధ్ధికి మార్గం. ఎవరైనా ఆ మార్గమిట్టిదని చూచి వాస్తవంగా తెలుసుకుంటే, అతి తేజో వంతము, అతి రమణీయం అయిన ఆ మార్గం లో పాటుపడి ఆ మార్గముతో ఏకీభవించకుండా వుండడు.ఇలా తెలుసుకోవటం వల వాడు భగవంతుని పక్షమున చెరును. ధర్మం అవలంబించి అధర్మం నేదిరించును. లోకం యొక్క శ్రేయస్సు కోసం పాటు పడతాడు. స్వప్రోయోజనమును కోరుకోడు.
ఇలా భగవంతుని పక్షమున వుంటే అతడు మాలో ఒక్కడు అవుతాడు. హిందువని, బౌద్ధుడు అని గాని, క్రైస్తవుడని గాని, మహమ్మదీయుడని గాని పేరు పెట్టుకున్నా, హిందు దేశ వాసి యైనా, ఆంగ్లేయ దేశ వాసి యైనా, చీనా దేశస్తుదైనా, రష్యా దేశపు వాడైనా భేదం కొంచెం కూడా లేదు. భగవంతుని పక్షమున వుండే వాళ్ళు ఏ కారణము తో ఈ లోకానికి వచ్చారో తామేమి చేయాలో దాని ని తెలుసుకొని దానిని చేయపూనుకుంటారు. తక్కిన వారంతా తామేమి చేయాలో దానిని ఇంకా తెలుసుకోకపోవటం చేత తరచుగా అవివేకంగా నటిస్తూ , అందరూ ఒక్కటే అని, ఒక్కడే అయిన భగవంతుడి ఇచ్ఛయే ఎపుడూ గాని అందరికీ యథార్థంగా ప్రియంగా వుండదని తెలుసుకోలేక, తమకు మాత్రం ప్రియమని తోచు మార్గాల్నీ కల్పించేందుకు పూనుకుంటారు. అట్టి వారందరూ అసత్తును అనుసరించు వారలు గాని సత్తు ననుసరించుట లేదు. ఈ రెంటికి వున్న తేడా తెలుసుకునేంత వరకూ వారు భగవంతుని పక్షమున చేరినవారు కారు. కాబట్టి ఈ వివేకం మొదటి మెట్టు.

(సశేషం)

1 comment:

Anonymous said...

Good brief and this fill someone in on helped me alot in my college assignement. Say thank you you as your information.