Saturday, July 24, 2010

సద్గురువు-1

సద్గురువు అన్న పదానికి సరైన నిర్వచనంచెపుతూ , ఎవరు సరైన సద్గురువో గుర్తు పట్టి ఆయనను అనుసరించి ఆయన చూపిన మార్గంలో ఎలా నడవాలో అలతి అలతి వాక్యాలతో, అనల్ప అర్థాలతో అరటిపండు చేతిలో వొలిచి పెట్టినట్లు చెప్పిన ఈ వ్యాసం గురువు గురించి, ఆధ్యాత్మికత ను గురించి తెలుసుకోవాలనుకునేవారికి సరైన దిశానిర్దేశం చేస్తుంది. శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు రాసిన “ సాయి మాస్టర్ ప్రవచనములు” గ్రంథం నుండి అద్భుతమైన ఈ వ్యాసం గురుపూర్ణిమ సందర్భంగా ......


సద్గురువు-1

గురు మధ్యే స్థితం విశ్వం, విశ్వ మధ్యే స్థితో గురుః
గురుర్విశ్వం నచాన్యోస్థి, తస్మై శ్రీ గురవే నమః


గురువే విశ్వం. గురువుకన్యంగా మరొకటి లేదు. అంటే గురువు సకల దేవతా స్వరూపి. బాగా అవగాహన చేసుకుంటూ పోయేవారికి ఈ చరాచర విశ్వమంతా గురువు యొక్క స్వరూపమే. అంతకు భిన్నంగా మరొకటి లేదు. ఈ శ్లోకం వల్ల తెలిసేదేమిటంటే --- ఈ చరాచర విశ్వమంతా తమ రూపమేనని ఎవరైతే నిరూపణ ఇవ్వగలరో వారే నిజమైన, సిసలైన, సంపూర్ణమైన గురువుఅని.


ఉదాహరణకు శ్రీకృష్ణుడు జగద్గురువు గా, యోగీశ్వరుడిగా, గీతాచార్యుడిగా లోకం లో ఇంతటి కీర్తి గడించడానికి కారణం భగవద్గీతోపదేశం కాదు. ఎందుకంటే అదే భగవద్గీతను అనేకసార్లు చదివినటువంటి మామూలు వ్యక్తి గూడా శ్రీకృష్ణుడు చెప్పినంత గొప్పగానూ ఉపన్యాసం ఇవ్వగలడు. కానీ, మామూలు వ్యక్తి చేయలేని పని ఒకటుంది అదే విశ్వరూప సందర్శనం. శ్రీకృష్ణుడు అర్జునునికి విశ్వరూప సందర్శనం కలిగించాడు. తాను చెప్పిందంతా నిజమని నిరూపించాడు. ఆ పని మామూలు వ్యక్తి ఎలా చేయగలడు? తాను చెప్పినది నిజమని అర్జునుడికి అనుభవపూర్వకంగా నిదర్శనమిచ్చాడు శ్రీకృష్ణుడు. ఈ సృష్టి అంతా తన రూపమేనని చెప్పాడు. అప్పటి దాకా శ్రీకృష్ణుడు ఎంతగా చెప్పినా, “ ఏమిటబ్బా! ఇట్లా చెప్పాడీయన’ అని అర్జునుడికి అనిపిస్తుంది. కానీ, విశ్వరూప సందర్శనమయ్యేసరికి అర్జునునికి అప్పటివరకు తాను చెప్పిన విషయాలు మొత్తం ( అంటే విశ్వరూప సందర్శనం ఇచ్చేటప్పటికి ఎన్ని అధ్యాయాలు గీతా లో వున్నాయో అన్నీ) సమన్వయమై, అనుభవమై, దర్శనమయ్యాయి. అదే కృష్ణుని యొక్క గొప్పతనం. అందువలననే ఆ విషయం లో శ్రీకృష్ణునికి సాటి ఎవరూ లేరు. మరలా అదే విషయం అంత సంపూర్ణం గానూ పామరులైన మానవులకు గూడా ఈ విశ్వమంతా తమ రూపమేనని అనుభవపూర్వకం గా నిరూపించినవారు శ్రీ శిరిడీ సాయి నాథుడు.


ఎంతో మంది మహాత్ములు వచ్చారు, పోయారు. ఇందులో ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అన్నది ప్రశ్న కాదు. కానీ మనకు అనుభవపూర్వకం గా నిరూపించడం వల్ల మార్గం సులభమవుతుంది.మన మనస్సు తేలిక అవుతుంది. ఏ మహాత్ముడైనా, శ్రీకృష్ణుడైనా, ఏ దైవమైనా చెప్పేది ఒక్కటే, “ క్షణకాలమైనా విడవకుండా ఎల్లప్పుడూ మనసులో నన్నే చింతన చేస్తూ వుండండి. గుర్తు పెట్టుకోండి. మీ క్షేమ సమాచారాలన్నీ నేను కనిపెడుతుంటాను,” అనే. భక్తుల యోగ క్షేమములు వహిస్తానని శ్రీకృష్ణుడు చెప్పాడు. అదే సాయి గూడ చెప్పారు. ఎంత మంది మహనీయులు వచ్చారో, అంతమందీ ఇదే మాట చెప్పారు.

ఎంత మంది చెప్పినా ఒకటి మాత్రం మన వల్ల కాదు. అదేమిటంటే అంతా ఆయన రూపమేనని అనుకోవడం. కుక్క కుక్కగా కనపడుతుంటే, మనిషి మనిషిగా కనపడుతుంటే, వీళ్లంతా ఆయన రూపమేనని అనుకోవడం ఎట్లా? ప్రక్క వారి మీద మనకు ఆగ్రహం వస్తుంది, అనుగ్రహం వస్తుంది. కోపం, అసూయ, ద్వేషం, భయం మొదలైనవన్నీ వస్తూంటాయి. కానీ, ఇవన్నీ కల్గించేటటువంటి మానవాకృతులన్నీ పరమేశ్వరుని రూపమని అనుకోవడమెట్లా?
ఇంట్లో నిశ్చలంగా కూర్చొని భగవంతుని కోసం ధ్యానం చేస్తూ వుంటే ఎంతో ప్రయత్నం మీద ఆ ధ్యాన మందిరం లో కూర్చోన్నంత సేపు భగవంతుడి మీద మనస్సు నిలిస్తే నిలిచి యుండు గాక. కానీ ఎల్లప్పుడూ నిలవదు.


ఉదాహరణకు ఒకడు ఆ ప్రయత్నం చేస్తూ వుంటే ( అంతా భగవత్స్వరూపమేనని ) ఇంట్లోని పిల్లవాడు వచ్చి విపరీతం గా అల్లరి చేశాడనుకోండి.వాడి మీద కోపం వచ్చి వాడిని చావబాదాడనుకోండి.అప్పుడు ఏమయిందన్న మాట?అంతకు ముందు వరకు తను చేసే ధ్యానం లో అతడు ఈ ప్రపంచంలో వున్న నామరూపాలన్నీ నీవేనయ్యా! అని నమస్కారం చేసుకొన్నాడు. వెంటనే ఆ పిల్లవాడిని పట్టుకొని చావబాదాడు. అప్పుడు ఎవర్ని పట్టుకొని చావబాదినట్లు?ఒక వేళ బాధకపోయినా , తీవ్రమైన ఆగ్రహం వచ్చి, ‘ ఈ ఇల్లు నరకంరా! ‘ అన్నాడనుకోండి. అప్పుడు ఏమయింది? ఏ పరాత్పరుడు తన చుట్టూ ఉన్నాడో, అన్నీ రూపాలలో ఉన్నదో అదే వీడికి నరకమయింది. అంటే జగత్తు రూపం లో బ్రహ్మం ఉంది. “ సర్వం ఖల్విదం బ్రహ్మ” కానీ మనస్సులో నరకమే ఉన్నదని అర్థం. చూడగలిగే వాళ్ళకు అదే భగవత్స్వరూపం.చూడలేని వారికి అదే మామూలు గృహం. చికాకులో ఉండేవారికి అదే నరకం. మన దృష్టిని బట్టే అంతా వుంది. కాబట్టి మన దృష్టి మారాలి.

పూజా గృహాలలో నుంచి ఇవతలకు రాగానే నిత్య జీవితం లో అవతల వారి పనుల వల్ల, మాటల వల్ల రాగద్వేషాలు ప్రకోపిస్తాయి. అందుకని మనం గుర్తుపెట్టుకోవడం కోసం మనం చేసే ప్రయత్నం వెంటనే ఎగిరిపోతుంది.వాడిట్లా చేశాడు, వీడిట్లా అన్నాడు అని, ఇదే జాబితా చదువుతుంది మనస్సు. మనం ఇక దైవాన్ని గుర్తుపెట్టుకొనేది ఎక్కడ?కనుక ఇది మానవజాతికి అంత సులభం కాదు. అంత తేలికగా రాదు. ఇది మామూలు మానవులకే గాదు. గొప్ప గొప్ప ఋషీశ్వరులకు గూడ చాలా కష్టమయిన విషయం.ఆ ఋషీశ్వరులు మామూలు కార్యక్రమాలన్నింటినీ మానుకొని అరణ్యాలలో వుంటూ ఘోర తపస్సు చేసుకుంటూ అంతర్ముఖులై వుంటారు. ఎంతో ధ్యాన నిష్టతో , తపస్సుతో పైకి వచ్చిన మహనీయులు కూడా ఏ కారణం చేతనైనా ఆ తపస్సు లోంచి లేచి ఇవతలకు వచ్చిన క్షణాల్లో వారి మనస్సు చంచలమవుతున్నది. ప్రక్కకే పోతున్నది. ఒకరికి కామం వల్ల కావచ్చు, మరొకరికి మరొక కారణం కావచ్చు.ఆయా పనుల ద్వారా వారి తపస్సు వ్యర్థమయిపోయి మరలా తపస్సు చేసుకోవడమనే కర్మ పట్టడం మన పురాణాలలో చెప్పబడ్డది. ఒక ఋషీశ్వరుడు తపస్సు చేసుకొంటున్నాడు. ఎవరో ఏదో చేశారు, వారికి ఆగ్రహం వచ్చింది. “ ఒరేయ్ నీవీట్లా అయిపో!” అని శాపం పెట్టాడు. ఆ శాపం రూపం లో, ఆగ్రహ రూపం లో వాడికి పతనం వస్తుంది. అప్పుడు అవతలివాడికి కూడా కొద్దో గోప్పో సామర్ధ్యం వుంటే వాడి తపస్సుతో వాడూ శాపం పెట్టాడు. అప్పుడు ఏమయిందన్నమాట? వాడి శాపం తీరేదాక వీడా శాపఫలాన్ని అనుభవించవలసిందే. అప్పుడు ఇంతకు ముందు చేసిన తపస్సంతా వ్యర్థమయిపోయినట్లే గదా!
(సశేషం)

1 comment:

Anonymous said...

కల్పన,
మీ రచనలు బాగున్నాయి...
భరద్వాజ మాష్టరు గారిని స్మరించే అవకాశం కల్పించినందుకు
కృతఙ్ఞతలు......
తెలుగుజాతిని సద్గురుసేవలో తరింపజేయటానికి..
నిరంతరం శ్రమించిన సద్గురువు భరద్వాజ మాష్టరు గారు.