Tuesday, July 20, 2010

బుద్ధుడు చెప్పిన మధ్యే మార్గం

ఆరోజుల్లో శరీరాన్ని శుష్కింప జేసుకుంటే కాని ముక్తి లభించదని సన్యాసానికి సంబంధించిన తాత్వికులు భావించేవారు. కాని గౌతముడు అటువంటి వాటివలన ప్రయోజనం లేదని వాస్తవానికి అవి ఒకడి బుద్ధిని పట్టుదలను క్షీణింప జేస్తాయని గ్రహించాడు. ఈ బాధాకరమైన విధానాన్ని వదిలేసాడు. అలాగే దీనికి వ్యతిరేకంగా రెండో అంచున వున్న నైతిక ప్రగతికి ఆటంకమైన స్వర్గ సుఖాలలో ఓలలాడే విధానాన్ని కుడా వదిలేసాడు. ఆ కొస ఈ కొస కాని మధ్యే మార్గం ఎన్నుకోవాలనే ఆలోచన చేసాడు. ఈ మధ్యే మార్గం తరువాత తరువాత అతని బోధకు ముఖ్య లక్షణమైంది.

ఆనాడు తన తండ్రి ఏరువాక లో నాగలి దున్నుతున్న సమయం లో , తాను వెలగ చెట్టు చల్లటి నీడ లో , వ్యస్తపాదుడై తన శ్వాస పై తాను కేంద్రీకరించినప్పుడు, సాధించిన ఝానాన్ని, ( లేదా పరమానందం, లేదా సిద్ధి) ఒక సారి గుర్తు చేసుకొని ఇలా అనుకున్నాడు, “ మంచిది. జ్నానోదయానికి ఇదే మంచి మార్గం".

అలా శుష్కించిన దేహం తో జ్నానోదయం సాధ్యం కాదని గుర్తించాడు.ఆధ్యాత్మిక ప్రగతికి దేహ దారుడ్యం ముఖ్యం. అందుకని అతడు మితం గా శరీరాన్ని పోషించాలనుకొని ఘన, ద్రవ ఆహార పదార్ధాలను తీసుకోవడం మొదలుపెట్టాడు.

అతను ఏదో సాధిస్తాడు, సాధించింది తమకు చెప్తాడు అని ఎదురుచూసిన అతని శిష్యులు, అతడు తన విధానాన్ని మార్చుకోవడం తో నిరాశ చెంది,అతనిని, ఆ ప్రదేశాన్ని విడిచి ఇసి పట్టణానికీ వెళ్ళి, అక్కడి వారందరికీ, “ గౌతముడు విలాస జీవితాన్ని గడుపుతున్నాడు. తపోసమరాన్ని విడనాడి సుఖ జీవితాన్ని స్వీకరించాడు" అని చెప్పారు.

సహాయం అవసరమైన ఆ సంకట సమయం లో అతనిని వొంటరీ వానిని చేసి, వదిలిపెట్టి పోయారు. అయినా అతడు నిరాశ చెందలేదు. ఆ మహా సమరం లో వారి సాన్నిధ్యం సహాయ కారియే అయినా, వారి ఐచ్చిక ఎడబాటు అతనికి ప్రయోజన కారియే అయింది. ఏకాంతంగా, అరణ్యాలలో , వొంటరీ తనం లో , గొప్పవాళ్ళు నిగూడ సత్యాలను కనుగొన్నారు, రహస్యమైన సమస్యలను కూడా ఛేదించారు.

సత్యోదయమ్

కొంత ఘన ఆహారంతో, పోయిన బలాన్ని పుంజుకున్నాడు. అతడు చిన్నతనం లో సాధించిన ఝానానికి తేలికగానే మెరుగు పెట్టాడు. క్రమక్రమం గా రెండు, మూడు, నాలుగు ఝానాలను గూడ అతను సాధించాడు.

ఝానాల సాధనతో మనస్సు ని పరిపూర్ణ ఏకాగ్రత తో నిలప గలుగుతున్నాడు. ప్రతి వస్తువుని దాని వాస్తవాకుర్తి లో ప్రతిబింబించే తుడిచిన అడ్డమ్లా, అతని మనస్సు ఇప్పుడు ఉంది. ఈ విధం గా అతని మనస్సు ప్రశాంతమైంది, పరిశుద్ధమైంది. నిర్మలమైంది. లాలస, మురికి నుంచి స్వేచ్ఛ పొందింది. సామ్యమైంది. దృడమైంది. స్థిరమైంది. అకంపితమైంది. అప్పుడు పూర్వ జన్మల స్మృతులకు సంబంధించిన జ్నానమ్ మీదికి మనస్సుని మరలించాడు. గత జన్మలలోని తన వివిధ భాగ డేయాలను గుర్తు తెచ్చుకున్నాడు. “ మొదట ఒక జీవితం, తరువాత రెండు జీవితాలు, ఆ తరువాత మూడు, నాలుగు ఐదు, పది, ఇరవై, ఏభై జీవితాల వరకూ, ఆ తరువాత వంద, వేయి, వంద వేలు, ఆ తరువాత అనేక విశ్వ ఆవృతాల (చక్రాల ) వలయాన్ని ఆ తరువాత అనేక విశ్వ ఆవృతాల లయ, పరిణామాలను గుర్తు తెచ్చుకున్నాడు. ఆ చక్రం లో అప్పట్లో తాను ఫలానా, తన పేరు ఫలానా, తన కుటుంబం ఫలానా, తాను ఫలానా ఆహారం తినేదాడు, తాను ఫలానా సుఖ దుఃఖాలను అనుభవించాడు. తన అంతం ఫలానా విధం గా జరిగింది, మళ్ళీ అక్కడ బయలుదేరి తాను మరో చోట జన్మించాడు. ఈ జన్మలో తన పేరు ఫలానా, అనుభవించిన సుఖదుఃఖాలు ఫలానా, ఫలానా విధం గా తన అంతం జరిగింది. అక్కడ నుంచి బయలుదేరి ఇక్కడ జన్మించాడు".

ఈ విధం గా గత జన్మలలోని వివిధ భాగాడేయాల వివరాలను గుర్తు తెచ్చుకున్నాడు.

రాత్రి మొదటి జాగరణ లో అతడు వాస్తవం గా సాధించిన జ్నానమ్ ఇది.

గతానికి సంబంధించిన అజ్నానాన్ని ఈ విధంగా పారద్రోలి, అతని పరిశుద్ధ మనస్సు ని జీవుల భవాభావాలపై ( అంతరించడం, తిరిగి ఆవిర్భవించడం) సారించాడు. విమల, అతి మానవ జ్నాన (యోగా) దృష్టితో , జీవులంతా ఒక అస్తిత్వం నుంచి మరో అస్తిత్వానికి మారడాన్ని పరికించాడు. ఉచ్చ, నీచ జీవులు, అంద, అంద విహీన, సుఖులు, దుఃఖులు --- అంతా వారి వారి కర్మల ననుసరించి గతిస్తున్నారని తెలుసుకొన్నాడు. వారి చెడ్డ పనులు, మాటలు, ఆలోచనలు కారణం గా, మంచి వారిని దూషించిన కారణం గా, తప్పుడు నమ్మకాల కారణంగా, వారి శరీరాలు లుప్తమైన తర్వాత, మరణించిన తరువాత, ఈ వ్యక్తులు దుఃఖ భాగులై జన్మిస్తారని గ్రహించాడు. ఈ వ్యక్తులు మంచి పనులు, మాటలు, ఆలోచనల కారణం గా, మంచి వాళ్ళను దూషించని కారణంగా, మంచి నమ్మకాల కారణం గా, వారి శరీరాలు నశించిన తర్వాత, మరణించిన తర్వాత, సుఖకరమైన దివ్య లోకాల్లో జన్మిస్తారని తెలుసుకున్నాడు.

ఈ విధం గా అతడు తన యోగా అతి మానవ దృష్టితో జీవుల భవాభావాలను చూశాడు.
ఇది నిజం గా అతడు రాత్రి మధ్య జాగరణం లో సాధించిన రెండో జ్నానమ్.

భావికి సంబంధించిన అజ్నానాన్ని ఈ విధంగా పరిహరించిన అతడు, తన విమల మనస్సు ను మలినాల పరిచ్ఛేదం వైపు కి మళ్ళీంచాడు.
వాస్తవ విషయానుగుణంగా అతడు గుర్తించాడు. “ ఇది దుఃఖం, ఇది దుఃఖం కలగడం, ఇది దుఃఖ నివృత్తి. ఇది దుఃఖ నివృత్తి మార్గం". అలాగే వాస్తవ విషయానుగుణం గా అతడు గుర్తించాడు. “ ఇవి మలినాలు. ఇది మలినాలు పట్టడం, ఇది మలీనాల నివారణం, ఇది మలినాల నిరోధానికి దారి తీసే మార్గం". ఈ గుర్తింపు తో , ఈ గ్రహింపు తో, అతని మనస్సు విషయ వాంఛా మలినం నుంచి, అస్తిత్వ తృష్ణ మలినం నుంచి , ఆవిద్యా మలినం నుంచి విముక్తమైంది.

విముక్తుడు కావటం తో, అతడు తెలుసుకున్నాడు. “ నేను ముక్తుడనయ్యాను". అతనికి జ్నానోదయం అయింది. “ పునర్జన్మ అంతమైంది; పవిత్ర జీవితం సిధ్ధించింది, చేయవలసింది చేశాను. ఇక ఈ స్థితి సంబంధమైంది ఇంకా ఏమీ లేదు".

రాత్రి చివరి జాగరణం లో అతడు ఆర్జించిన మూడో జ్నానమ్ ఇది.
అజ్నానమ్ అంతరించింది. జ్నానోదయం అయింది. చీకటి తొలగిపోయింది. వెలుతురు వచ్చింది.

బుద్ధ దర్శనం పుస్తకం నుంచి
ఆంగ్ల మూలం : నారద మహా థేరా
తెలుగు అనువాదం : అన్నపురెడ్డి వెంకటేశ్వర రెడ్డి
ఆనంద బుద్ధ విహార ట్రస్ట్ ప్రచురణ

3 comments:

Anonymous said...

నేను చాలా కాలం నుంచి ఎన్నొ ఆధ్యాత్మిక పుస్తకాలు చదివాను. కాని ఈ మధ్య చదివిన ఇన్నర్ యోగా అనే పుస్తకం రాసినది అనిర్వాన్ చాలా బాగా ఉంది. యోగ,ధ్యాన పద్దతుల మీద సూటి గా 100 పేజీలలో వివరించారు. మీరు తప్పక చదవండి. వెల రూ60/-

durgeswara said...

మంచి విషయాలు తెలియజేస్తున్నారు .ధన్యవాదములు

శర్మ said...

నాకు పుస్తకం పంపగలరు