బుద్ధుడు
దేవతల, మానవుల ప్రయోజనం కోసం, సుఖంకోసం, మంచికోసం ఈ ప్రపంచం మీద అనుకంపతో ఒక మహాద్బుతమైన అనన్యుడైన వ్యక్తి ఈలోకంలో జన్మించాడు.ఎవరీ అద్వితీయ వ్యక్తి??అతడే తధాగతుడు. ఉన్నతుడు, జ్ఞానోదయం అయినవాడు.
అంగుత్తర నికాయం 1,1,13ప్.22
జననం నుంచి పరిత్యాగం వరకూ....
ప్రపంచంలోకే అత్యంత ధర్మ ప్రవక్త కానున్న ఓ రాకుమారుడు నేటి నేపాలులో భారతదేశ సరిహద్దులో కపిలవస్తునగరం లుంబినీవనంలో క్రీ.పూ 623 సంవత్స్పరము మే నెల(వైశాఖ శుద్ధ పూర్ణిమ)నాడు జన్మించాడు. ఇతని తండ్రి కులీన శాక్య తెగకు చెందిన శుద్ధోధన మహారాజు. తల్లి రాణి మహామాయ.అతడు పుట్టిన 7వ రోజునే తల్లి మరణించింది. ఈమె చెల్లి మహాప్రజాపతిగౌతమి. మహారాజు మరో భార్య. ఈమె తన స్వంత బిడ్డ అయిన నందుడ్ని దాదులకు అప్పగించి ఆ బిడ్డ పెంపకాన్ని చేపట్టింది.రాకుమారుని జననాన్ని పురస్కరించుకొని ప్రజలు ఘనంగా వేడుక జరుపుకొన్నారు. రాజ గురువైన అసితుడనే మహఋషి తన దివ్య దృష్టితో బిడ్డ భవిష్యత్తు మహోజ్వలంగా వుందని తెలుసుకొని తన పీఠం నుంచి లేచి నిలబడి చేతులు జోడించి ఆ బిడ్డకు నమస్కరించాడు. తర్వాత అవేదనతో నేను అరూపలోకంలో పూర్వం పొందిన జననాల కారణంగా ఈ మహామహునివల్ల కొంచం అయినా ప్రయోజనాన్ని పొందలేకపోతున్నానే అని అన్నాడు.
నామకరణ మహోత్సవం
రాకుమారుడు పుట్టిన 5వ రోజు అతనికి సిద్ధార్ధుడు అని పేరు పెట్టారు. సిద్ధార్ధుడు అంటే "సిద్ధించిన అర్ధం" (తీరిన కోరిక) కలవాడు, అతను గౌతమ గోత్రానికి చెందినవాడు, అందుకని సిద్ధార్ధగౌతముడైనాడు.
ఫ్రాచీన భారతీయ సంప్రదాయం ప్రకారం నామకరణోత్సవానికి బ్రాహ్మణ పండితులని పిలిపించారు. వారిలో ఎనిమిది మంది విశిష్ట వ్యక్తులు వున్నారు. బిడ్డ లక్షణాలను పరిశీలించిన ఎనిమిది మందిలో ఏడుగురు రెండేసి వ్రేళ్లను ఎత్తి చూపారు. దీనికి అర్ధం రెండు విధాలా జరిగే అవకాశం వుందని చెప్పడం. అంటే అతడు మహా చక్రవర్తి గాని, బుద్ధుడు గాని అయ్యే అవకాశం వుందని చెప్పారు. ఆ ఎనిమిది మందిలో అందరికంటే చిన్నవాడు, ధీమంతుడు అయిన కొండణ్ణ మాత్రం మిగతా ఏడుగురితో ఏకీభవించలేదు. రాకుమారుని నుదుటి మీద కుడివైపుకి తిరిగి వున్న వుంగరాల జుట్టు చూసి ఇతడు ఒక వ్రేలు మాత్రమే ఎత్తి చూపి ఇలా అన్నాడు “ రాకుమారుడు ఖచ్చితంగా సంసార లంపతాన్ని త్యుజించి, బుద్దుడే అవుతాడు” అని అతి విశ్వసనీయం గా చెప్పాడు.
వైవాహిక జీవితం
తనకు ఈడూ జోడూ అయిన అందాల రాణి యశోధర ను, తన పదహారవ ఏట వివాహ మాడాడు. వివాహానంతరం దాదాపు పదమూడు సంవత్సరాలు భోగ జీవితాన్ని గడిపాడు. రాజప్రాసాద ప్రాకారానికి వెలుపలి జీవితం, వొడిదుడుకుల గురించి తెలియని ఆనందంలో అతని జీవితం సాగింది. రాకుమారునిగా తన భోగ జీవితాన్ని గురించి అతడు ఇలా అంటాడు.
“ నేను సున్నిత మనస్కుడను. అత్యంత సున్నిత మనస్కుడను. నా తండ్రి గారి నివాసం లో ప్రత్యేకించి నా కోసం మూడు పద్మాల కొలనులను నిర్మించారు. ఒక కొలనులో నీల లోహిత పద్మాలు వికసించాయి. మరో దానిలో అరుణ పద్మాలు, వేరొక దానిలో శ్వేత పద్మాలు వికసించాయి. కాశీకి చెందని ఏ గంధపు చెక్కలను నేను వాడలేదు. నా తలపాగా, అంగీ, దుస్తులు అన్నీ కాశీ నుంచి వచ్చినవే.”
“ ఎండ , చలి, ఆకులు, దుమ్ము, మంచు –ఏదీ నన్ను తాకాకుండా రేబవలు నాపై ఒక శ్వేత ఛత్రాన్ని పట్టి వుంచారు.”
“ నాకోసం మూడు ప్రాసాదాలను నిర్మించారు – ఒకటి చలి కాలానికి, మరొకటి వేసవికి, వేరొకటి వర్షాకాలానికి. వర్షాకాలం నాలుగు నెలలు. వర్షాకాల భవనం లో ఒక్క సారి గూడ బయటకి రాకుండా వున్నాను. ఈ కాలం అంతా సంగీత విదూషీమణులు గానం వినిపించారు. ఇతరుల ఇళ్ళల్లో పులిసిన గంజి వూక నుంచి తయారైన అంబాలిని బానిసలకు, పనివాళ్ళకు ఎలా ఇస్తారో, అలాగే మా తండ్రి గాని నివాసం లో బానిసలకు, పనివాళ్లకు బియ్యం, మాసాలతో తయారైన ఆహారాన్ని ఇచ్చారు.”.
కాలం గడిచేకొద్దీ క్రమంగా అతనికి జీవిత వాస్తవాలు తెలియసాగాయి. అతని నిశిత పరిశీలనాప్రవృత్తి, హద్దులేరగని అతని అనుకంప, అతనిని రాజప్రాసాదంలో క్షణికానందమ్ లో కాలం వెళ్ళదీయనీయలేదు. అతడు వ్యక్తిగత దుఃఖమంటూ ఒకటి ఎరగడు. కానీ అతడు మానవాళి బాధను తన బాధగా చేసుకొన్నాడు. సుఖభోగాలమధ్య అతడు దుఃఖ సార్వత్రికతను గుర్తించాడు.
(నేడు బుద్ధ జయంతి సందర్భం గా)
(సశేషం)
No comments:
Post a Comment