Showing posts with label ఎక్కిరాల భరద్వాజ. Show all posts
Showing posts with label ఎక్కిరాల భరద్వాజ. Show all posts

Sunday, July 25, 2010

సద్గురువు-2


ఇదంతా ఎందుకు చెప్పానంటే , అంతటి మహాత్ములకే , తపస్వులకే అంతర్ముఖులై నిశ్చలం గా అదే నిష్ట లో ఉండటం సాధ్యపడలేదు. కాసేపు తెరిపి కోసం బయటికొస్తే ఆ కాసేపటి లోనే బోల్తా కొట్టి పోయినవాడే వున్నాడు. తపస్సు భగ్నమైనవాళ్ళూ వున్నారు. అది అంతటి కష్టమైన పని. అది ఋషీశ్వరులకే సాధ్యపడలేదంటే ఇంక మనం ఎంత జాగ్రత్తగా వుండాలో తెలుసుకోవాలి.
ఉదాహరణకు ఒక రోజు ఒక భక్తురాలు బాబా వద్దకు వచ్చి బాబా ను తన ఇంటికి భోజనానికి రమ్మంది. “ అలాగే తల్లీ! తప్పకుండా వస్తాను. భోజనం కూడా చేస్తాను. కానీ నేను వస్తే మాత్రం ఛీ కొట్టి తరిమేయకు సుమా! “ అని అన్నారు బాబా. బాబా! “ నేను మిమ్మల్ని అలా యెందుకు చేస్తాను? మీరు తప్పక రావాలి" అని ప్రార్ధించి ఆమె ఇంటికి వెళ్ళింది. బాబా కు ఆతిథ్యమివ్వడానికి వంటకాలను సిద్ధం చేసి బాబా కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. భోజన సమయం దాటి పోతున్నా బాబా మాత్రం రాలేదు. కానీ ఒక కుక్క వచ్చి బాబా కోసం వండి వడ్డించడానికి సిధ్ధంగా వున్న వంటకాలను ముట్టుకోబోయింది. అది చూచిన ఆమె పొయ్యి లో వున్న కట్టెను తీసి ఆ కుక్క పైకి విసిరింది. ఆ కుక్క తప్పించుకొని వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆమె చాలా సేపు బాబా కోసం వేచి చూచింది గాని బాబా రాలేదు. తర్వాత ఎంతో బాధగా మసీదు కి వెళ్ళి బాబా తన ఇంటికి భిక్షకు రానందుకు నిష్టూరమాడింది. అప్పుడు బాబా ఆమెతో, “ నేను వస్తే మండుతున్న కట్టే నాపై విసిరావు గదమ్మా! నువ్వే నన్ను గుర్తు పట్టలేదు. సర్వ జీవుల రూపాలలో నేనే వున్నానని గుర్తుంచుకో" అని చెప్పారు.

అలాగే హంసరాజ్ అనేవాడు చాలా కాలం గా ఉబ్బశవ్యాధితో బాధపడుతుండేవాడు. ఎన్ని వైద్యాలు చేసినా తగ్గకపోయేసరికి బాబా దగ్గరకు వచ్చి శిరిడి లోనే కొంతకాలమున్నాడు. అతనిని బాబా పుల్లపెరుగు తినవద్దన్నారు. కానీ అతడికి పుల్ల పెరుగంటే చాలా ఇష్టం.అందుకని బాబా తినవద్దన్నా కూడా భార్య చేత బలవంతాన తోడు పెట్టించుకొని తినేవాడు. కానీ సర్వజ్నుడైన బాబా కు తెలియనిదేమున్నది? బాబా చిత్రమైన లీల చేశారు. ప్రతి రోజూ ఆ దంపతులు మసీదులో మధ్యాహ్న హారతి కి హాజరయ్యేవారు.వారు అక్కడికి వచ్చిన సమయం లో ప్రతి రోజూ వీళ్ళ రూమ్ లోకి ఒక పిల్లి వచ్చి పెరుగు తినిపోయేది. మొదటి రోజలా జరిగేసరికి పొరపాటు అనుకొని అన్నీ జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ అదేమీ చిత్రమో వీరెన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ పిల్లి రావటం, పెరుగు తినిపోవడం ప్రతి రోజూ జరుగుతూనే వుంది. చివరకు అతనికి విసుగు పుట్టి కోపం వచ్చి హారతి కి గూడ పోకుండా దాన్నెలాగైనా రాకుండా చూడాలని, వస్తే కొట్టాలని నిర్ణయించుకొని ఒక కర్ర చేత్తో పట్టుకొని కాపలా కూర్చున్నాడు. సరిగా సమయానికి ఆ పిల్లి రానే వచ్చింది. “ రోజూ పెరుగు తిని పోతావా?” అని అతడు దానిని కర్రతో కొట్టాడు. తర్వాత అతడు మసీదు కి రాగానే బాబా అన్నారు: “ ఇక్కడొక పనికిమాలిన వాడు ఉబ్బసం తో బాధపడుతున్నాడు. వాడిని పుల్లపెరుగు తినవద్దని చెప్పాను. ఎంత చెప్పినా వినకుండా అతడు తింటూనే వుంటే నేనే పిల్లి రూపం లో వెళ్ళి తిని అతడా పెరుగు తినకుండా చూస్తున్నాను. చివరకు వాడు నన్నీరోజు కర్రతో కొట్టాడు" అన్నారు.
అలాగే బల్వంత్ నాచ్నే అన్నగారు బొంబాయి లో శస్త్ర చికిత్స కానీ ఆస్పత్రి లో వున్న సమయం లో వాళ్ళింటికి ఒక సాధువు వచ్చి భిక్ష అడిగాడు. అతని వాడిన గారు అన్నం పెట్టింది. ఇంట్లో బెండకాయ కూర వుంది గానీ అది అందరూ టీనాగా మిగిలినది కదా! అని ఆయనకు వెయ్యలేదు. వేరే కూర వేసింది. కానీ ఆ సాధువు ఆ కూరే అడిగి వేయించుకొని మరీ తిన్నాడు. ఆ తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత అతడు శిరిడీ మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు బాబా ఆ సాధువు తామేనని అతనికి తెలిపారు.

ఇలాంటి ఎన్నో సంఘటనల ద్వారా ఏ సాధువు కి పెట్టినా తనకే చెందుతుందని, ఏ ప్రాణీని ఆదరించినా , హింసించినా తనకే చెందుతుందనీ నిరూపించారు బాబా.

ఏ దైవానికైనా మొక్కుకొని ఆ మ్రొక్కు ఎగ్గొడితే వాళ్ళు రాగానే వాళ్ళు మ్రొక్కుకున్నంత డబ్బూ అడిగి పుచ్చుకునేవారు. అలాగని ప్రక్కవాడు డబ్బులిస్తే తీసుకునేవారు కాదు.” ఏమయ్యా! వాడిస్తే తీసుకొంటివి, వీడిస్తే తీసుకోలేదేమని అడిగితే " వాడు మ్రొక్కుకొని ఎగ్గొడితే అడిగి తీసుకున్నాను. వీడు మ్రొక్కుకోలేదు గనుక వీడి దగ్గర తీసుకోలేదు. “ అనేవారు. కాబట్టి ఏ దేవతకార్పించినా తనకే చెందిందని, చివరకు మానవమాతృణ్ణి గూడ ఏ విధంగా చూచుకున్నా గూడ అది ఆయనకే చెందిందని భక్తులకు అసంఖ్యాకంగా అటువంటి అనుభూతులను ఇస్తూనే వచ్చారు.అంతటా అన్నీ రూపాలలో వ్యాపించి వుంటాయి. కారణం అన్నీ రూపాలలో ఆయనే వున్నారు గనుక.

ఉదాహరణకు చంద్రాబాయి బొర్కర్ అను భక్తురాలు శిరిడీ కొంతకాలమున్నారు. అప్పుడామే భర్త పండరిపురం లో వున్నాడు. ఒకరోజు బాబా ఆమెతో పండరిపురం లోని ఆమె భర్త వద్దకు వెళ్ళమని చెప్పారు.ఆమె వెంబడే తానుంటానని గూడ చెప్పారు.కానీ ఆమె అక్కడకు వెళ్ళేసరికి ఆయనక్కడ లేరు. ఎక్కడికి వెళ్ళారో గూడ తెలియలేదు. ఏమీ చేయాలో తోచని పరిస్థితులలో ఆమె వుండగా, ఒక ఫకీర్ ఆమె వద్దకు వచ్చి మీ వారు ధోండ్ స్టేషన్ లో వున్నారు. వెంటనే వెళ్ళమని చెప్పి టికెట్టు గూడ ఇచ్చారు. అంతేగాక ఆమె భర్తకు గూడ కలలో ఒక ఫకీర్ కనిపించి నీ భార్య ఫలానా రైలు లో వస్తున్నదని చెప్పారు. తర్వాత ఆ ఫకీర్ సాయిబాబానేనని వాళ్ళు తెలుసుకున్నారు.

బాబా ఆదేశం ప్రకారం ఖాండోబా ఆలయం లో వున్న ఉపాసనీ బాబా, బాబా కు నైవేద్యమిచ్చిన తరువాత తను భోజనం చేసేవారు. ఒకరోజు ఉపాసనీ ఆ నైవేద్యాన్ని తీసుకొని పోతూ వున్నప్పుడు ఒక నల్ల కుక్క తోకాడిస్తూ వెంటబడింది. దీనికి పెట్టిన తర్వాత బాబాకు నైవేద్యం పెట్టడం ఎట్లాగా అని దానిని ఛీ కొడుతూ , కసిరి కొడుతూ మసీదు కి వెళ్లారు. వీరు మసీదు కి వెళ్ళి బాబాకు నైవేద్యం ఇవ్వబోతే , “ ఇక్కడికెందుకు తీసుకు వచ్చావు? నేనక్కడ నల్ల కుక్క రూపం లో వున్నాను గదా!” అన్నారు బాబా. కాబట్టి ఇక నుంది గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నిద్దామని అనుకొన్నాడు. అంతగా ప్రయత్నించినప్పటికీ, అంత జాగ్రత్తగావుంటున్నప్పటికీ మరలా ఏమారడతను.ఒక రోజు ఇతను వంట చేసుకుంటుంటే బిచ్చమెత్తుకునే వాడొకడు ఆశగానిలబడి దాని వైపు చూస్తున్నాడు. కాబట్టి అది అపవిత్రమౌతుందని తలచి అతనిని కసిరి కొట్టాడు. నైవేద్యం మసీదు కి తీసుకెళ్ళగానే మరలా బాబా కోప్పడ్డారు. “ ఇప్పటి నుండి గుర్తు పెట్టుకో. ఎక్కడ నీ దృష్టి పడుతుందో, అక్కడ నేనున్నా" నని చెప్పారు బాబా. ఈ విధంగా సకల చరాచర విశ్వమంతా తమ రూపమేనని నిరూపించిన శ్రీ సాయిబాబా సమర్థ సద్గురువు.

Saturday, July 24, 2010

సద్గురువు-1

సద్గురువు అన్న పదానికి సరైన నిర్వచనంచెపుతూ , ఎవరు సరైన సద్గురువో గుర్తు పట్టి ఆయనను అనుసరించి ఆయన చూపిన మార్గంలో ఎలా నడవాలో అలతి అలతి వాక్యాలతో, అనల్ప అర్థాలతో అరటిపండు చేతిలో వొలిచి పెట్టినట్లు చెప్పిన ఈ వ్యాసం గురువు గురించి, ఆధ్యాత్మికత ను గురించి తెలుసుకోవాలనుకునేవారికి సరైన దిశానిర్దేశం చేస్తుంది. శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు రాసిన “ సాయి మాస్టర్ ప్రవచనములు” గ్రంథం నుండి అద్భుతమైన ఈ వ్యాసం గురుపూర్ణిమ సందర్భంగా ......


సద్గురువు-1

గురు మధ్యే స్థితం విశ్వం, విశ్వ మధ్యే స్థితో గురుః
గురుర్విశ్వం నచాన్యోస్థి, తస్మై శ్రీ గురవే నమః


గురువే విశ్వం. గురువుకన్యంగా మరొకటి లేదు. అంటే గురువు సకల దేవతా స్వరూపి. బాగా అవగాహన చేసుకుంటూ పోయేవారికి ఈ చరాచర విశ్వమంతా గురువు యొక్క స్వరూపమే. అంతకు భిన్నంగా మరొకటి లేదు. ఈ శ్లోకం వల్ల తెలిసేదేమిటంటే --- ఈ చరాచర విశ్వమంతా తమ రూపమేనని ఎవరైతే నిరూపణ ఇవ్వగలరో వారే నిజమైన, సిసలైన, సంపూర్ణమైన గురువుఅని.


ఉదాహరణకు శ్రీకృష్ణుడు జగద్గురువు గా, యోగీశ్వరుడిగా, గీతాచార్యుడిగా లోకం లో ఇంతటి కీర్తి గడించడానికి కారణం భగవద్గీతోపదేశం కాదు. ఎందుకంటే అదే భగవద్గీతను అనేకసార్లు చదివినటువంటి మామూలు వ్యక్తి గూడా శ్రీకృష్ణుడు చెప్పినంత గొప్పగానూ ఉపన్యాసం ఇవ్వగలడు. కానీ, మామూలు వ్యక్తి చేయలేని పని ఒకటుంది అదే విశ్వరూప సందర్శనం. శ్రీకృష్ణుడు అర్జునునికి విశ్వరూప సందర్శనం కలిగించాడు. తాను చెప్పిందంతా నిజమని నిరూపించాడు. ఆ పని మామూలు వ్యక్తి ఎలా చేయగలడు? తాను చెప్పినది నిజమని అర్జునుడికి అనుభవపూర్వకంగా నిదర్శనమిచ్చాడు శ్రీకృష్ణుడు. ఈ సృష్టి అంతా తన రూపమేనని చెప్పాడు. అప్పటి దాకా శ్రీకృష్ణుడు ఎంతగా చెప్పినా, “ ఏమిటబ్బా! ఇట్లా చెప్పాడీయన’ అని అర్జునుడికి అనిపిస్తుంది. కానీ, విశ్వరూప సందర్శనమయ్యేసరికి అర్జునునికి అప్పటివరకు తాను చెప్పిన విషయాలు మొత్తం ( అంటే విశ్వరూప సందర్శనం ఇచ్చేటప్పటికి ఎన్ని అధ్యాయాలు గీతా లో వున్నాయో అన్నీ) సమన్వయమై, అనుభవమై, దర్శనమయ్యాయి. అదే కృష్ణుని యొక్క గొప్పతనం. అందువలననే ఆ విషయం లో శ్రీకృష్ణునికి సాటి ఎవరూ లేరు. మరలా అదే విషయం అంత సంపూర్ణం గానూ పామరులైన మానవులకు గూడా ఈ విశ్వమంతా తమ రూపమేనని అనుభవపూర్వకం గా నిరూపించినవారు శ్రీ శిరిడీ సాయి నాథుడు.


ఎంతో మంది మహాత్ములు వచ్చారు, పోయారు. ఇందులో ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అన్నది ప్రశ్న కాదు. కానీ మనకు అనుభవపూర్వకం గా నిరూపించడం వల్ల మార్గం సులభమవుతుంది.మన మనస్సు తేలిక అవుతుంది. ఏ మహాత్ముడైనా, శ్రీకృష్ణుడైనా, ఏ దైవమైనా చెప్పేది ఒక్కటే, “ క్షణకాలమైనా విడవకుండా ఎల్లప్పుడూ మనసులో నన్నే చింతన చేస్తూ వుండండి. గుర్తు పెట్టుకోండి. మీ క్షేమ సమాచారాలన్నీ నేను కనిపెడుతుంటాను,” అనే. భక్తుల యోగ క్షేమములు వహిస్తానని శ్రీకృష్ణుడు చెప్పాడు. అదే సాయి గూడ చెప్పారు. ఎంత మంది మహనీయులు వచ్చారో, అంతమందీ ఇదే మాట చెప్పారు.

ఎంత మంది చెప్పినా ఒకటి మాత్రం మన వల్ల కాదు. అదేమిటంటే అంతా ఆయన రూపమేనని అనుకోవడం. కుక్క కుక్కగా కనపడుతుంటే, మనిషి మనిషిగా కనపడుతుంటే, వీళ్లంతా ఆయన రూపమేనని అనుకోవడం ఎట్లా? ప్రక్క వారి మీద మనకు ఆగ్రహం వస్తుంది, అనుగ్రహం వస్తుంది. కోపం, అసూయ, ద్వేషం, భయం మొదలైనవన్నీ వస్తూంటాయి. కానీ, ఇవన్నీ కల్గించేటటువంటి మానవాకృతులన్నీ పరమేశ్వరుని రూపమని అనుకోవడమెట్లా?
ఇంట్లో నిశ్చలంగా కూర్చొని భగవంతుని కోసం ధ్యానం చేస్తూ వుంటే ఎంతో ప్రయత్నం మీద ఆ ధ్యాన మందిరం లో కూర్చోన్నంత సేపు భగవంతుడి మీద మనస్సు నిలిస్తే నిలిచి యుండు గాక. కానీ ఎల్లప్పుడూ నిలవదు.


ఉదాహరణకు ఒకడు ఆ ప్రయత్నం చేస్తూ వుంటే ( అంతా భగవత్స్వరూపమేనని ) ఇంట్లోని పిల్లవాడు వచ్చి విపరీతం గా అల్లరి చేశాడనుకోండి.వాడి మీద కోపం వచ్చి వాడిని చావబాదాడనుకోండి.అప్పుడు ఏమయిందన్న మాట?అంతకు ముందు వరకు తను చేసే ధ్యానం లో అతడు ఈ ప్రపంచంలో వున్న నామరూపాలన్నీ నీవేనయ్యా! అని నమస్కారం చేసుకొన్నాడు. వెంటనే ఆ పిల్లవాడిని పట్టుకొని చావబాదాడు. అప్పుడు ఎవర్ని పట్టుకొని చావబాదినట్లు?ఒక వేళ బాధకపోయినా , తీవ్రమైన ఆగ్రహం వచ్చి, ‘ ఈ ఇల్లు నరకంరా! ‘ అన్నాడనుకోండి. అప్పుడు ఏమయింది? ఏ పరాత్పరుడు తన చుట్టూ ఉన్నాడో, అన్నీ రూపాలలో ఉన్నదో అదే వీడికి నరకమయింది. అంటే జగత్తు రూపం లో బ్రహ్మం ఉంది. “ సర్వం ఖల్విదం బ్రహ్మ” కానీ మనస్సులో నరకమే ఉన్నదని అర్థం. చూడగలిగే వాళ్ళకు అదే భగవత్స్వరూపం.చూడలేని వారికి అదే మామూలు గృహం. చికాకులో ఉండేవారికి అదే నరకం. మన దృష్టిని బట్టే అంతా వుంది. కాబట్టి మన దృష్టి మారాలి.

పూజా గృహాలలో నుంచి ఇవతలకు రాగానే నిత్య జీవితం లో అవతల వారి పనుల వల్ల, మాటల వల్ల రాగద్వేషాలు ప్రకోపిస్తాయి. అందుకని మనం గుర్తుపెట్టుకోవడం కోసం మనం చేసే ప్రయత్నం వెంటనే ఎగిరిపోతుంది.వాడిట్లా చేశాడు, వీడిట్లా అన్నాడు అని, ఇదే జాబితా చదువుతుంది మనస్సు. మనం ఇక దైవాన్ని గుర్తుపెట్టుకొనేది ఎక్కడ?కనుక ఇది మానవజాతికి అంత సులభం కాదు. అంత తేలికగా రాదు. ఇది మామూలు మానవులకే గాదు. గొప్ప గొప్ప ఋషీశ్వరులకు గూడ చాలా కష్టమయిన విషయం.ఆ ఋషీశ్వరులు మామూలు కార్యక్రమాలన్నింటినీ మానుకొని అరణ్యాలలో వుంటూ ఘోర తపస్సు చేసుకుంటూ అంతర్ముఖులై వుంటారు. ఎంతో ధ్యాన నిష్టతో , తపస్సుతో పైకి వచ్చిన మహనీయులు కూడా ఏ కారణం చేతనైనా ఆ తపస్సు లోంచి లేచి ఇవతలకు వచ్చిన క్షణాల్లో వారి మనస్సు చంచలమవుతున్నది. ప్రక్కకే పోతున్నది. ఒకరికి కామం వల్ల కావచ్చు, మరొకరికి మరొక కారణం కావచ్చు.ఆయా పనుల ద్వారా వారి తపస్సు వ్యర్థమయిపోయి మరలా తపస్సు చేసుకోవడమనే కర్మ పట్టడం మన పురాణాలలో చెప్పబడ్డది. ఒక ఋషీశ్వరుడు తపస్సు చేసుకొంటున్నాడు. ఎవరో ఏదో చేశారు, వారికి ఆగ్రహం వచ్చింది. “ ఒరేయ్ నీవీట్లా అయిపో!” అని శాపం పెట్టాడు. ఆ శాపం రూపం లో, ఆగ్రహ రూపం లో వాడికి పతనం వస్తుంది. అప్పుడు అవతలివాడికి కూడా కొద్దో గోప్పో సామర్ధ్యం వుంటే వాడి తపస్సుతో వాడూ శాపం పెట్టాడు. అప్పుడు ఏమయిందన్నమాట? వాడి శాపం తీరేదాక వీడా శాపఫలాన్ని అనుభవించవలసిందే. అప్పుడు ఇంతకు ముందు చేసిన తపస్సంతా వ్యర్థమయిపోయినట్లే గదా!
(సశేషం)

Wednesday, January 20, 2010

సూఫీ మహాత్ముడు హజరత్ తాజుద్దీన్ బాబా

ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో క్రీ.శ. 1850-1950 ల మధ్య కాలం ఎంతో విశిష్టమైనది. కారణం ఈ మధ్య కాలంలోనే శ్రీ శిరిడీ సాయిబాబా, మరికొందరు మహా సిధ్ధ పురుషులు ఆధ్యాత్మిక పథంలో భౌతికంగా దర్శనమిచ్చారు. ప్రపంచ ఆధ్యాత్మిక జీవితాన్ని నడిపించే ఒక మహాత్ముల చక్రముందని, ఆ చక్రానికి 72 మంది వివిధ మతాలకు చెందిన సిధ్ధ పురుషులు చక్ర పత్రాలైతే, శ్రీ శిరిడి సాయినాధుడు ఇరుసులా వుంటారని- ఒక సాంప్రదాయం. వారిలో శ్రీ శిరిడి సమగ్ర జీవిత చరిత్రను, వారి సమకాలికులైన మరి నలుగురు ప్రసిధ్ధ సిధ్ధ పురుషుల –శ్రీ స్వామి సమర్ధ (అక్కల్కోట), శ్రీ తాజుద్దీన్ బాబా (నాగపూర్), శ్రీ గజానన్ మహారాజ్ (షేగాం), శ్రీ ధునీవాలా దాదా (ఖాండ్వా)-చరిత్రలను ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు ఆంగ్లం లోనూ, తెలుగులోనూ రచించారు. శ్రీ తాజుద్దీన్ బాబా జయంతి (జనవరి 27) సందర్భంగా శ్రీ భరద్వాజ గారు రాసిన ‘ శ్రీ తాజుద్దీన్ బాబా దివ్య చరిత్ర ‘ పుస్తకం నుండి ఈ వ్యాసాన్ని తయారుచేసి ‘ సాయిబాబా’ మాస పత్రిక జనవరి సంచికలో ప్రచురించారు. నాగపూర్ కి చెందిన సూఫీ ఫకీర్ తాజుద్దీన్ బాబా జీవితం గురించి ఈ వ్యాసం ఒక చిన్న పరిచయం.
తాజుద్దీన్ బాబా జననం-సాధన
అది ఆగస్ట్ 17, 1925 వ సంవత్సరం. ఆనాడు జరిగిన రెండు సంఘటనలునాగపూర్ వాసులను ఆవేదనలోనూ ఆశ్చర్యంలోనూ ముంచివేశాయి. హజరత్ తాజుద్దీన్ బాబా ఆ రోజే సమాధి చెందడం వారి ఆవేదనకు కారణమైతే, పండరీ విఠల్, రుక్మాదేవి విగ్రహాలు పన్నెండు గంటల సేపు సంతత ధారగా కన్నీరు కార్చడం వారి ఆశ్చర్యానికి కారణం. విగ్రహారాధనను నిరసించే ముస్లిం మతానికి చెందిన ఫకీర్ హజ్రత్ తాజుద్దీన్ బాబా సమాధి చెండితే హిందు దేవతా విగ్రహాలు దుఃఖించడం విచిత్రం కాదా! దైవం హిందువా? ముస్లిమా ? అసలు ఆయన మతమేది?
ముస్లిముల చేత పీర్ (గురువు ) గా, హిందువుల చేత భగవదవతారంగా కీర్తించబడిన తాజుద్దీన్ బాబా పూర్వీకులు అరబ్బు దేశం వారు. హజరత్ ఇమామ్ ఆస్కార్ అనే ఆయన మనుమదైన సయ్యద్ అబ్దుల్లా అరేబియా దేశం నుండి హిందూ దేశానికి వచ్చి మద్రాస్ లో స్థిరపడ్డారు. చాలా కాలంగా ఆయన సంతతివారంతా మద్రాస్ పరిసర ప్రాంతాలలోనే నివసించేవారు. వారి వంశంలోని వాడే సయ్యద్ బదృద్దీన్. సయ్యద్ బదృద్దీన్ సైన్యంలో చేరి మద్రాస్ ప్లాటూన్ -32 లో సుబేదారు గా వుంటూ కాంప్టి అనే ఊళ్ళో వుండేవాడు. అతను షేక్ మీరాన్ సాహెబ్ గారి కుమార్తె అయిన మీరాన్ బీ ని వివాహం చేసుకున్నాడు.
1861 వ సంవత్సరం జనవరి 27 వ తేదీన గురువారం ఉదయం గం.5-15 నిమిషాలకు మీరాబీ కి కొడుకు పుట్టాడు. ఆ పిల్లవానికి తాజుద్దీన్ అని పేరు పెట్టారు. అయితే తాజుద్దీన్ అందరి పిల్లల వలె ఏడవలేదు. తల్లితండ్రులు శిశువులో జీవం ఉన్నదో లేదోనని అనుమానించి గాబరా పడి శిశువుకు చైతన్యం కలిగించడం కోసం వారి ఆచారం ప్రాకారం శిశువు కణతల మీద ముఖం మీద కాల్చారు. వెంటనే శిశువు తాను జీవించే వున్నానని తెలుపడానికేమో అన్నట్లు కొద్ది క్షణాలు మాత్రమే రోదించి ఊరుకొని కళ్ళు తెరిచి అన్నీ వైపులకూ చూడదమారంభించాడు. మహాత్ముడైన తాజుద్దీన్ ముఖం మీద ఆనాడు కాల్చిన ముద్రలు శాశ్వతం గా ఉండిపోయాయి.
తాజుద్దీన్ తల్లితండ్రులకు ఆయనను బాబా తాజుద్దీన్ గా చూచే అదృష్టం లేకపోయింది. తాజుద్దీన్ పుట్టి సంవత్సరం తిరుగక ముందే అతని తండ్రి బదురుద్దీన్ చనిపోయాడు. ఆయనకు 9వ సంవత్సరం రాగానే తల్లి గూడ గతించింది. తండ్రి చనిపోయాక తాజుద్దీన్ వారి అమ్మమ్మగారి ఇంటివద్దనే పెరిగాడు. అతని ఆరవ ఏటా స్కూల్లో చేర్పించారు. 6 వ సంవత్సరం నుంచీ 18 వ సంవత్సరం దాకా తాజుద్దీన్ అరబ్బీ, పార్శీ, ఇంగ్లీష్ భాషలు నేర్చుకున్నారు.
ఆశీర్వాదం
తాజుద్దీన్ చదువుకునే బడికి ఒకసారి ఆ ప్రాంతంలో ప్రఖ్యాతి గాంచిన ముస్లిం మహాత్ముడు హజరత్ అబ్దుల్లాషా వచ్చారు. అప్పుడు తాజుద్దీన్ ఒకటో తరగతిలో వున్నాడు. ఆ మహాత్ముడు తాజుద్దీన్ వైపు దృష్టి నిగిడ్చి చూచి సంచీలో నుండీ కొంత మిఠాయిని తీసి కొంచెం చప్పరించి తాజుద్దీన్ నోట్లో వేశారు. తరువాత ఆ ముస్లీమ్ ఫకీర్ ఉపాధ్యాయులతో తాజుద్దీన్ చూపుతూ “ ఇతనికి మీరేం బోధించగలరు. ఇతని విద్యాభ్యాసం ఇదివరకే పూర్తయింది.” అన్నారు. “ మితంగా తిను, మితంగా మాట్లాడు, ఖురాన్ చదివేటప్పుడు మహమ్మదుల వారే నిన్నావేశించనట్లు భావయుక్తంగా పఠించు: అని తాజుద్దీన్ తో చెప్పి ఆశీర్వదించి వెళ్ళారు.
హజరత్ అబ్దుల్లా షా ఆశీర్వదించి వెళ్ళాక తాజుద్దీన్ లో వింతైన మార్పు వచ్చింది ఏదో పారవశ్యం అతనిని ముంచివేసింది. మూడు రోజుల పాటు ఆగకుండా అతని కళ్ళ వెంట సంతత ధారగా ఆనంద భాష్పాలు కారాయి. ఆ తర్వాత తాజుద్దీన్ కు ఆట పాటల యందు ఆసక్తి తగ్గింది. ఎప్పుడూ ఒంటరిగా గడిపే తాజుద్దీన్ పుస్తకాలు చదివి అర్ధం చేసుకునే జ్నానమ్ కాలిగాక గొప్ప గొప్ప సూఫీ మహాత్ములు రచించిన గ్రంధాలను చదువుతూ క్రమం గా అధ్భూతమైన వారి జీవిత విధానాల వైపుకు ఆకర్షితుడైనాడు.
అతను చదివిన వాటన్నింటిలోకి ఒక గొప్ప ముస్లిం మహాత్ముడు చెప్పిన ద్విపద ముస్లిం తాజుద్దెన్ హృదయాన్ని ఆకట్టుకోండి. దాని భావమేమిటంటే.....
“ సారాయి త్రాగు!
ఖురాన్, కాబాలను తగులబెట్టు!
కావాలంటే దేవాలయాల్లో నివసించు!...కానీ,….
ఏ మానవుని హృదయాన్ని ఎన్నడూ గాయపరచకూ!!”
గొప్ప మహాత్ముడైన హజరత్ అబ్దుల్లా షా ఈ ద్విపదను కేవలం సాహిత్య పరమైన అర్ధం తో చెప్పారనుకోవటం సరికాదనిపిస్తుంది. సూఫీ మహాత్ములు వ్రాసే అటువంటి ద్విపదలు భావగర్భితమైన పరిభాషలో వుంటాయి. ఆ పదాలలో పైకి ప్రకటమయ్యే అర్ధం గాక లోతైన ఆధ్యాత్మిక సత్యాలు ఇమిడి వుంటాయి. సామాన్యంగా వారు ఆధ్యాత్మిక అనుభూతులను గురించి చెప్పేటప్పుడు ప్రేమ, త్రాగుడు, మైకం లాంటి పదాలను వాడుతూ వుంటారు. పైన చెప్పిన ద్విపద లో ‘ సారాయం త్రాగు ‘ అంటే భగవంతునిపై భక్తితో పారవశ్యం చెందు అని భావం. ఖురాన్ అంటే కేవలం కొన్ని కాగితాలు, వాటిపై ముద్రించబద్ద రంగు సిరా మాత్రమే కాదని, పవిత్రమైన కాబా అంటే కేవలం ఒక నల్లని రాతి ముక్క మాత్రమే కాదని, అవి రెండూ కేవలం నామరూప సహితమైన వస్తువులనే భావాన్ని వదిలి వాటికాధారంగా , అతీతంగా వున్న శాశ్వతానందాన్ని పొందడమే –ఖురాన్, కాబాలను తగులబెట్టటమంటే! దేవాలయాల్లో నివసించడమంటే ఎవరి మత ధర్మాలను వారినాచరించుకోనీమని, ఎవరి నమ్మకాలనూ, ఆచారాలనూ వారిని పాటించుకోనీమనీ భావం. అయితే ఈ మూడు ఆచరించినా, ఆచరించకపోయినా, ఇతరుల హృదయాన్ని ఎన్నడూ గాయపరచకూడదనే ఉత్తమ ధర్మాన్ని పాటించమని ఆఖరి పాదం లోని భావం. తాజుద్దీన్ బాబా జీవిత చరిత్ర అంతా ఆయన హృదయాన్ని ఆకట్టుకున్న ఈ సత్యాలను గూర్చిన మౌన వ్యాఖ్య.
తాజుద్దీన్ 18 వ ఏట కాంప్టి దగ్గరగా వున్న కమ్మాన్ అనే నదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ వరదలకు అపారమైన జన నష్టం, ఆస్తుల నష్టం జరిగింది. ఎంతో మందికి నిలువ నీడ, తినటానికి తిండీ లేకుండా పోయింది. వరద బాధితుల కష్టాలను చూచి తాజుద్దీన్ హృదయం చలించింది. తల్లితండ్రులు పోయాక తాజుద్దీన్ కి ఆశ్రయమిచ్చినా మేనమామ హజరత్ అబ్దుల్లా రహమాన్ గారి ఇల్లు కూడా కూలిపోయి, ఆయనకూ ఎంతో నష్టం వచ్చింది. ఇల్లు గడవడం కోసం ఆయన అటవీ శాఖలో పని చేయవలసి వచ్చింది. ఆయనే సైన్యంలో చేరమని సలహా ఇవ్వటంతో తాజుద్దీన్ తన 20 వ ఏట 1881 వ సంవత్సరంలో 13 వ నాగపూర్ రెజిమెంట్ లో చేరాడు. సైన్యంలో వుండగా తాజుద్దీన్ ఉద్యోగ నిర్వహణలో దేశం నలుమూలలా తిరిగాడు. ఫ్రాన్స్ మొదలైన విదేశాలలో కూడా ఆయన పర్యటించారు. విదేశాల నుండి వచ్చాక వారి రెజిమెంట్ హైదరాబాద్ లో గ్రాస్ ఫారం అనేచోట స్థావరమేర్పర్చుకుంది. అక్కడ వుండగానే ‘ బెంజ్ ‘ అనే అమెరికన్ అధికారి తాజుద్దీన్ తో పరిచయం ఏర్పర్చుకొని ఆయన వద్ద ఖురాన్ అంతా నేర్చుకున్నాడు. విలియమ్స్ అనే ఆయన కూడా తాజుద్దీన్ కు సన్నిహితుడై ఆధ్యాత్మికంగా పురోగతి పొందాడు. తర్వాత విలియమ్స్ కలకత్తా వెళ్ళాడు. అక్కడ బంగ్ మేరీ అనే చోట విలియమ్స్ సమాధిని మనం నేటికీ చూడవచ్చు.
1884 వ సంవత్సరంలో తాజుద్దీన్ సైనిక దళం సాగర్ అనేచోటికి చేరింది. సైన్యంలో పని చేసే రోజుల్లో కూడా తాజుద్దీన్ నమాజ్ చేయడంలో ఎప్పుడూ ఆశ్రధ్ధ చూపలేదు. సౌగర్ లో వుండేటప్పుడే ఒక రోజున తాజుద్దీన్ కు అతి మధురమైన గానం వినిపించింది. ఆ గానం చేస్తున్న వారెవరో వెతుక్కుంటూ బయల్దేరి ఊరూ బయట నివసిస్తున్న హజరత్ దావూద్ షా చిస్తీ అనే ముస్లిం మాహాత్ముని నివాసం చేరాడు. అది మొదలు ప్రతి రోజు తన ఉద్యోగ ధర్మం ముగిశాక తాజుద్దీన్ ఆ మహాత్ముని సాంగత్యంలో గడిపేవాడు.
ఆయన సన్నిధిలో ఎంతో సేపు ధ్యానం చేసేవాడు. తరచుగా రాత్రంతా అక్కడే గడిపి తెల్లవారాక శిబిరానికి వెళ్ళేవాడు. తాజుద్దీన్ రాత్రిళ్లు తరచుగా ఎటో వెళ్తున్నాడని కాంప్టి లో వుండే ఆయన బామ్మ గారికి తెలిసింది. తాజుద్దీన్ చెడు సావాసాలు చేస్తున్నాడేమోనని తలచిన ఆమె మనవణ్ణి మందలించడానికి సౌగర్ వచ్చి రహస్యంగా ఒకరోజు రాత్రి తాజుద్దీన్ ను వెంబడించింది. తాజుద్దీన్ నేరుగా ముస్లిం మహాత్ముని వద్దకు వెళ్ళి దైవ ధ్యానం చేసుకుంటూ వుండటం చూసి సంతోషంగా తిరిగి వచ్చింది. మరునాడు ఉదయమే తిరిగి వచ్చిన తాజుద్దీన్ కి ప్రేమతో ఫలహారం అందించింది బామ్మగారు. కానీ తాజుద్దీన్ వాటిని తినక తన చేతిలో వున్న రెండు రాళ్ళను బామ్మ గారికి చూపిస్తూ “ ఇవిగో నా దగ్గర లడ్డూ, జిలేబీ వున్నాయి.” అంటూ వాటిని నోట్లో వేసుకొని చప్పరిస్తూ తినేశాడు. తాజుద్దీన్ చేసిన ఈ పని బామ్మగారిని ఆశ్చర్యంలో ముంచేసింది. దైవ చింతనలో ఎక్కువ సమయం గడపడం వల్ల తాజుద్దీన్ లో అతీత శక్తులు మేల్కొన్నాయని గుర్తించిన బామ్మగారు మనుమడు ఏ దుష్ట సాంగత్యాన్నికి లోనూ కాలేదని సంతోషిస్తూ తిరిగి కాంప్టి చేరింది. హజరత్ దావూద్ చిస్తీ కొద్దికాలం తర్వాత మరణించారు. ఆ తర్వాత కూడా తాజుద్దీన్ ఆయన సమాధి వద్ద ఆధ్యాత్మిక సాధనలను కొనసాగించారు.
ఆయన చేసిన అసంఖ్యాకమైన లీలలు, బోధలు ఆయన దివ్య చరిత్ర లో వివరం గా చదవవచ్చు.
----శ్రీ హజరత్ తాజుద్దీన్ బాబా దివ్య చరిత్ర నుండి...
రచన : శ్రీ ఎక్కిరాల భరద్వాజ
పుస్తకాలు దొరుకు చోటు...
శ్రీ గురుపాదుక పబ్లికేషన్స్, ఎం.ఎం.డొంక, ఒంగోలు -523002,
ఫోన్ నెంబర్ 08592-233271