గురువు గురించి వివేకానందుడి పలుకులు
ప్రతి ఆత్మకూ పరిపూర్ణత పొందటమే విధాయకం. ప్రతి ప్రాణీ చివరకు పరిపూర్ణత పొందే తీరుతుంది. మన ప్రస్తుత స్థితి మన గత జన్మ కర్మల భావాల ఫలం. మన భవిష్యత్ స్థితి మన ఇప్పటి కర్మల, భావాల ఫలమై వుంటుంది. అంటే మన అదృష్టానికి మనమే కర్తలం. అయినా మన అదృష్ట నిర్మాణ కార్యంలో మనం ఇతరుల సహాయం పొందరాదనే నిషేధం ఏమీ లేదు. ఏ కొద్ది మందికో తప్ప ఇలాంటి సహాయం జన సామాన్యమందరికీ అత్యంత ముఖ్యం కూడా. అలాంటి సహాయం లభించినప్పుడు ఆత్మ లో ప్రచ్ఛన్న రూపంలో వుండే మహోత్కృష్ట శక్తులు సచేతనలవుతవి, పారమార్ధిక జీవనం మేలుకాంచుతుంది, అభివృధ్ధి విజృంభిస్తుంది. మానవుడు చివరకు పావనత్వాన్ని, పరిపూర్ణత్వాన్ని పొందుతాడు. ఈ వుజ్జీవన శక్తి గ్రంధాల నుంచి రాదు. ఆత్మకూ ఈ శక్తి మరొక ఆత్మ నుంచే లభించాలి గాని, మరెక్కడి నుంచీ లభించదు.. జీవిత కాలమంతా మనం గ్రంధావలోకన మగ్నులమై వుండవచ్చు. మనం అత్యంత బుధ్ధి పరిణితిని ఆర్జించవచ్చు. కానీ చివరకు మనకు పారమార్ధికాభివృధ్ధి లేశమైనా ప్రాప్తించి వుండదు. మహోన్నత బుధ్ధి పరిపాకం సాధించిన మానవుడి తదనురూపమైన పారమార్ధిక పరిపాకం కూడా అలవడే వుంటుందనటం అసత్యం. గ్రంధ పఠనం చేసేటప్పుడు మనకు అందుచేత పారమార్ధిక లాభం కూడా ప్రాప్తిస్తుందని మనం ఒక్కోసారి భ్రమ పడవచ్చు.కానీ పుస్తక పఠన ఫలాన్ని జాగ్రత్తగా పరిశీలించుకుంటే , బుధ్ధికి ఒకవేళ బలం చేకూరి వుండవచ్చు గాని, ఆత్మ ప్రబోధం ఏమీ కలుగలేదని స్పష్టపడుతుంది. పారమార్ధిక విషయాలను గురించి మనం అందరం అత్యధ్భుతోపన్యాసాలు ఇవ్వగలిగి వుండీ , యధార్ధమైన పారమార్ధిక జీవనం గడపటంలో కేవలం కుంటుపడి వుండటానికి కారణం ఇదే. పుస్తక పఠనం పారమార్ధిక ఉద్దీపనం కలిగించే విషయంలో కేవలం అసమర్ధం అవటమే. ఆత్మ ప్రబోధం మరొక ఆత్మ నుంచే రావాలి. ఈ ప్రబోధం ఎవరి ఆత్మ నుంచి వస్తుందో, ఆ వ్యక్తిని గురువు అంటారు. అది ఎవరి ఆత్మకు ప్రసాదించబడుతుందో, ఆ వ్యక్తిని శిష్యుడంటారు. ఈ పారమార్ధిక శక్తి ఒకరి నుంచి మరొకరికి లభించాలంటే, అది వెలువడే ఆత్మ కు ప్రసాద సమర్ధతా, గైకొనే ఆత్మకూ ప్రతి గ్రహణార్హతా వుండటం అత్యావశ్యకం. విత్తనం ప్రాణవంతమై వుండాలి; చేను దున్ని చల్లటానికి సిధ్ధపరిచి వుండాలి. ఈ రెండూ సమకూడితే, యధార్ధమైన పారమార్ధిక సస్యాభివృధ్ధి అత్యధ్భుత రూపంలో వెలువడుతుంది. నిజమైన మతబోధకుడు అత్యధ్భుత ప్రతిభావంతుడై వుండాలి. శ్రోత కూడా బుధ్ధి కుశలుడై వుండాలి. “ ఆశ్చర్యోవాక్తా కుశలోస్య లబ్ధా” ఇద్దరూ ఆశ్చర్యమైన వారు గానూ, అసాధారణమైన వారుగాను వుంటే తత్ఫలంగా మహోత్కృష్ట పారమార్ధిక ఉజ్జీవనం కలుగుతుంది. కాకుంటే అలాంటిది కలగటం అసాధ్యం. అలాంటివారే నిజమైన గురువులు, అలాంటి వారే నిజమైన శిష్యులూ, సాధకులూ. తక్కిన వారు చేసేది పారమార్ధిక భావాలతో చెరలాటాలు ఆడటమే. వారికదొక వినోద క్రీడామాత్రం. అదేమిటో కాస్త తొంగి చూస్తామనే కుతూహలం, ఒకింత బుధ్ధిగ్రాహ్యం చేసికొందామనే కోరిక, వారికి కలిగింది. అంతే. పారమార్ధిక జీవన క్షేత్రపు వెలుపటి పొలిమేర చిట్టచివర వారు నిలబడి వున్నారు. కానీ, దీన్లో గూడ కొంత గుణం వుంది నిజమే. కాలక్రమాన దాని నుంచే పారమార్ధిక జ్నాన తృష్ణ ఉదయించవచ్చు. అతి నిగూఢమైన ప్రకృతి ధర్మం ఒకటి వుంది – క్షేత్రం సంసిధ్ధమవటంతోనే బీజం ప్రాప్తించాలి. ప్రాప్తించి తీరుతుంది. ఆత్మకూ పారమార్ధిక ధర్మతృష్ణ తీవ్రం గా కలిగాక దానికి ఆ తృష్ణ ను తీర్చే పారమార్ధిక శక్తి ప్రాప్తించాలి. ప్రాప్తించి తీరుతుంది. గైకొనే ఆత్మలో పారమార్ధిక ధర్మ తేజస్సుని ఆకర్షించే శక్తి సమగ్రమై, బలిష్టమై వుండనప్పుడు, తత్సిధ్ధికి ఆవశ్యమైన తేజస్సును ఇవ్వగల శక్తి సహజంగానే లభించి తీరుతుంది.
(శ్రీ రామకృష్ణ మఠం వారు ప్రచురించిన హిందు మతం –వివేకానంద స్వామి పుస్తకం నుండి...)
2 comments:
Post a Comment