Tuesday, December 29, 2009
మహా మౌని, భగవాన్ రమణులు !
ఇరవైశతాబ్దం లో ఇలలో జన్మించిన అవతార పురుషులు, సద్గురువుల్లో అగ్రగణ్యులు భగవాన్ రమణ మహర్షి. ఆయన జీవిత విశేషాల గురించి , ఆయన బోధనల గురించి ప్రత్యేకం గా రాయాల్సిన పని లేదు. శివుడు గరళాన్ని సేవించి గరళకంఠుడైనాడంటే నమ్మశక్యం కాదు మనకు. అది నిరూపించటానికా అన్నట్లు పదహారవ ఏట పూర్వాశ్రమంలో వెంకట్రామన్ నామధేయులైన భగవాన్ మృత్యు అనుభవం పొందారు. ఆ అనుభవం నుండి ఆయన మృత్యుంజయుడైనారు.1907 లో కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని ఆయనను దర్శించి “ రమణ” అని పిలిచారు. అప్పటినుంచి ఆయన రమణ మహర్షి అయ్యారు. రమణ అంటే “ మధుర మూర్తి “ అని అర్ధమట. ఆ పేరు ఆయనకు ఎంత బాగా అమరిందో! గణపతి ముని ఆయనకు రమణ అని నామమిడితే , రమణులు ఆయనను “ నాయనా” అని సంబోధించారు. అప్పటినుంచి కావ్యకంఠ గణపతి ముని ని “నాయన” అని సర్వులూ వ్యవహారంలో ఆత్మీయంగా, ఆప్యాయంగా పిలుచుకునేవారు.
అరుణాచల గుహల్లో నివసించినప్పుడు భగవాన్ కి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం కలగకపోవటంతో ఎక్కువ మాట్లాడలేదు. మహర్షి అనంత శక్తివంతమైన మౌనంలోనే ఆశ్చర్యకరంగా భక్తులకు సంశయ నివారణ అయ్యేది. ఆ తర్వాత కూడా భగవాన్ అధిక సమయం మౌనంగా వుంటూ మానవ మాతృడిగా వ్యవహరించారు. ఆయనది మాట్లాడని మామూలు మౌనం కాదు. మహామౌనం. ఆ మహా మౌనమే విస్తారమైన జ్నాన బోధ. రమణుల సమస్త సంభాషణం కూడా “ నిన్ను నీవు తెలుసుకో” తో మొదలై దానితోనే పూర్తవుతుంది. కోతి, కుక్క, నెమలి లాంటి సమస్త జంతుజాలాన్ని మీరు అని గౌరవంగా సంబోధించి ప్రేమించి అందరిపై తమ అనుగ్రహాన్ని ప్రసరింపచేసిన కరుణామూర్తి. కుల, మతాలు, ఆచారాలు, మూఢ నమ్మకాలు మొదలైన అనవసరమైన వాటిని త్యుజించి నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏమిటో తన జీవిత విధానంతో చూపించారు భగవాన్.
“ నిన్ను నీవు తెలుసుకోకుండా, జగత్తును తెలుసుకోవాలనుకుంటే, అది నిన్ను చూసి వెక్కిరిస్తుంది. నీ మనస్సు యొక్క ఫలితమే, ప్రపంచం. ముందు ఆ మనస్సుని తెలుసుకో. తర్వాత జగత్తును చూడు. అప్పుడు అది ఆత్మ కంటే అన్యంగా, భిన్నంగా , విడిగా లేదని తెలుసుకుంటావు” అంటారు రమణులు.
ఒక భక్తుడు “ ఉద్యోగానికి రాజీనామా చేసి , నిరంతరం భగవాన్ సన్నిధిలో వుండాలనే తలంపు వుంది నాకు “ అని అడిగినప్పుడు భగవాన్ ఇలా సమాధానమిచ్చారు. “ భగవాన్ ఎప్పుడూ మీతోనే, మీలోనే మీరయ్యే వున్నారు. ఈ సత్యా సాక్షాత్కారానికి ఉద్యోగానికి రాజీనామా చేయనవసరం లేదు. ఇంటి నుంచి పలాయనం చేయనవసరం లేదు. పరిత్యాగమంటే వస్త్రాల్ని మార్చడం, కుటుంబ బండాల్ని బహిష్కరించడం, ఇంటిని, ఇల్లాలిని వదలడం కాదు. కానీ, వాటిపై వున్న కోర్కెల్ని,బంధాల్ని, అనుబంధాల్ని విడుచుటే. ఉద్యోగానికి రాజీనామా చేయవలసి పని లేదు. కానీ, ఈ సమస్త భారాల్ని మోసే భగవంతునితో రాజీపడు. అందరి భారాల్ని మోసే వాడు అతనే. కోర్కెల్ని పరిత్యుజించువాడు విశ్వంలో లీనమై, సమస్త ప్రపంచాన్ని ప్రేమించగలుగుతాడు. ప్రేమ, వికాసం, అనురాగం కలిగివుండటం నిజమైన దైవభక్తుని లక్షణాలు. పరిత్యాగం కంటే . ఎందుకంటే, సన్నిహితమైన తన బంధాన్ని, ప్రేమను, జాతి-మాట-కుల పరిమితులను దాటుటే, వాటిని అధిగమించుటే నిజమైన పరిత్యాగం.
సన్యాసి తన వస్త్రాల్ని, ప్రపంచాన్ని, ఇంటిని విసర్జిస్తున్నాడంటే, విరక్తి వల్ల కాదు. అట్లా చేయడం కానీ, తన చుట్టూ వున్న ప్రపంచాన్ని ప్రేమించి, సేవించాలనే కోరికతో అలా పరిత్యాగం చేస్తాడు. ఆ వికాసం కలిగినప్పుడు , తాను ఇంటి నుండి పారిపోతున్నాననే భావన వుండదు. కానీ, అది చెట్టు నుంది రాలిపోయిన పండు వలె సహజంగా జరుగుతుంది. పరిపక్వత రానంత వరకూ ఇల్లు , ఉద్యోగం వదులుట తెలివితక్కువ తనం.” అని ఎంతో సమగ్రంగా, వివరంగా అరటిపండు వొలిచి చేతిలో పెట్టినట్లు చెప్పారు భగవాన్.
రమణుల జన్మదినం డిసెంబర్ 30 , 1879.రమణుల జయంతి సందర్భంగా ఆయన బోధనల నుంచి కొన్నింటిని స్మరించి తరిద్దాము.ఆయన బోధనల గురించి తెలుగు లో ప్రత్యేక బ్లాగులే వున్నాయి. వాటిల్లో ఇంకా మంచి సమాచారం లభిస్తుంది. వాటిని ఇక్కడ చూడండి.
Subscribe to:
Post Comments (Atom)
10 comments:
అభినందనలు కల్పన. ఈ బ్లాగు కేవలం రమణమహర్షి గారి బోధనలకా? లేక అధ్యాత్మిక పరమైన విషయ పరిజ్ఞానాన్ని అందించటానికా?
ఉషా, ధన్యవాదాలు. ఈ బ్లాగ్ కేవలం రమణ మహర్షి బోధనల కోసమే కాదు. సద్గురువులందరి బోధనలు అందించాలని ఒక చిరు ప్రయత్నం.
Chala manci prayatnam. abhinandimcakunda vundalekapotunnam.
Plz. keep updating.
కల్పన గారు,
మీకు ధన్యవాదాలు, రమణ మహర్షి గారి యూట్యూబ్ ద్వారా జిడ్డు క్రిష్ణ మూర్తి గారి ఉపన్యాసాలు కూడా దొరికినాయి నాకు. నేనే కాదు నా పదిహేనేళ్ళ నా కూతురు (టీనేజర్స్ అందరూ ఇకనోక్లాస్ట్లే కదా) కూడా అవి ఎన్జాయ్ చేస్తుంది. ధన్యవాదాలు.
రవికిరణ్ తిమ్మిరెడ్డి.
రవికిరణ్,
జేకే వి నిజంగా చాలా మంచి వీడియోలు వున్నాయి. అర్ధం చేసుకోవటం కూడా కొంత సులభం అనిపిస్తుంది. మీ టీనేజీ అమ్మాయి కూడా చూస్తోందంటే నాకు సంతోషంగా వుంది. భయం గురించి, విద్యా వ్యవస్థ గురించి జెకే ప్రసంగాలు వీలైతే తెలుగు అనువాదం చేసి పెట్టాలి. మీకేమైనా ఇంటెరెస్ట్ ఉంటే మీరు చేసిన పర్వాలేదు.
Best thing that I have ever got in my life time - Swamy's Video. I wish we could see the videos of Sri Ramakrishna Paramahamsa and Shirdi Sai Baba.
===
బై ద వే, "గురుపాదుక" అని పేరెందుకు పెట్టారు? మీకు పాదుకా దీక్ష ఉన్నదా?
కిరణ్ కుమార్ గారు,
రామకృష్ణ పరమహంస, షిర్డీ సాయి భౌతికమ్ గా కలిసినట్లు లేదు. పరమహంస యోగానంద మాత్రం రమణ మహర్షి ని కలిశారు. మీకు తెలిసే వుంటుంది రామకృష్ణ పరమహంస నిర్యాణం చెందినప్పుడు బాబా మూడు రోజులు సమాధి లోకి వెళ్ళి వచ్చారు.
ఇక పాదుకా దీక్ష గురించి తెలియదు నాకు. అంటే ఏమిటి? నాకు కుల, మత ప్రస్తావన లేని దత్త సంప్రదాయం లో నమ్మకం వుంది. దత్తా సంప్రదాయం లో గురు పాదుకలకు వున్న ప్రాముఖ్యత దృష్ట్యా ఆ పేరు ఎంపిక చేసుకున్నాను. మరి పాదుకా దీక్ష అంటే ఏమిటి? ఎలా చేస్తారు? ఏమీ చేస్తారు అనేది మీరు నాకు వివరిస్తే తెలుసుకుంటాను. ఈ బ్లాగ్ లో ఒక టపా రాసినా బాగుంటుంది. ఏమంటారు?
సాయిబాబా, రామకృష్ణ పరమహంసా కలిసారని కాదు, విడివిడిగానే అయినా వీడియోలు ఉంటే బాగుటుందనుకున్నాను. బాబా చరిత్ర ఇంకా పరిశోధన చేయాలసి ఉందని నా అభిప్రాయం అండి. పాల్ బ్రంటన్ వ్రాసిన "ఎ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా" లో సాయిబాబావారి ప్రస్తావనే లేకపోవటం నాకు ఆశ్చర్యం కలిగించింది. కానీ, బాబా సచ్చరిత్రలో ఎవరో విదేశీయుడు వస్తే, ఆయనని కలవటానికి బాబా ఇష్టపడలేదనే విషయం వరకు మాత్రమే ఉంది.
మా శృంగేరి విరూపాక్ష సంప్రదాయంలో గురుదీక్ష ఇచ్చేటప్పుడు గురుపాదుకలని "గురుత్రయ" మంత్రం ఇస్తారండి. "గురుత్రయం" అంటే, స్వగురువు, పరమ గురువు (స్వగురువు గురువు), పరమేష్టి గురువు (పరమగురువు గురువు). సాథారణంగా గురువుగారు దీక్ష ఇచ్చినవారికే ఈ పాదుకలు ఇస్తారు. ఇది కాక, మహాపాదుకలని కూడా ఇస్తారు (గురు పాదుకల నుంచి ప్రమోషన్ అన్నమాట :))
ధన్యవాదాలండి. మంచి వీడియో చూపించారు. ఆ మహనీయుని సజీవం గా చూడలేకపోయినా ఇలా వీడియోలోనయినా చూసే భాగ్యం కలిగింది.
ఒకటి రెండు ఒరిజినల్ ఫోటోలు మాత్రమే బాబా వి మనం చూడగలమ్.
పాల్ బ్రాంటన్ పుస్తకం నేను చదినప్పుడు అదే అనుకున్నాను. బాబా దర్శనం ఇవ్వని విదేశీయుడు బ్రంటన్ కాదేమో అనుకుంటాను. ఎందుకంతే బ్రంటన్ బాబా దగ్గరకు వెళ్ళి దర్శనం దొరకకపోయినా ఆ విషయం పుస్తకం లో రాసి వుండేవారేమో కదా...అలా లేకపోవడం వల్ల ఇంకెవరైనా అయివుండవచ్చు బ్రంటన్ కాకుండా.
బాబా చరిత్ర మీద ఇంకా ఎక్కువ పరిశోధనల మీద నాకు ఎక్కువ ఆశ లేదు. ఎంత తెలుసుకుంటే ఏమిటి ఆయన గురించి, ఆయన బోధలు ఆచరణలో పెట్టలేకపోయిన తర్వాత అనిపిస్తుంది. ఎక్కిరాల వారు తెలుగు లో బాబా గురించిఎక్కువ పరిశోధనాత్మక విషయాలు అందించారు. మీరెప్పుడైనా చదివారా?
గురుపాదుక దీక్ష గురించి వివరం గా చెప్పారు. సంతోషం.
Post a Comment