Sunday, March 7, 2010

నీవెవరివో నువ్వు కనుక్కో!


మెలకువలో ప్రతీక్షణం మనం అలోచిస్తూనే వుంటాం. స్వప్నంలో కూడా అంతే. ఎన్నెన్నో ఆలోచించడం అనే గాఢమైన వ్యసనం వలన ఘర్షణ, అలజడి, ఆందోళన, దుఃఖాలు కలుగుతున్నాయి. వివిధ రకాల ఎన్నెన్నో తలంపుల వలన మనసు విచ్ఛిన్నమవుతుంది. చాలా బలహీనమవుతుంది. ఇలా గందరగోళంగా వున్న మనసుకు, ఏదైనా ప్రత్యామ్నాయం వుందా? అనే ప్రశ్న ఉదయిస్తుంది. అవును ఉంది, ఇది భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధించిన 'నేనెవరు? విచారణలో ' వున్నది. ఈ విచారణలో దృష్టి ధ్యాసనంతా మనసు కోశం, కేంద్రమైన నేను అనే భావన/అహంకారం/ 'ఆలోచించేవాడు' పై, యితర తలంపులన్నింటినీ దూరం చేస్తూ, కేంద్రీకరించి లగ్నం చేసి నిలపాలి. అలాంటి దృష్టి ధ్యాస వలన భగవాన్ రమణుల అనుగ్రహం సహాయం తోడురాగా శుద్ధనిర్మల మనసు యొక్క సహజ మౌన ప్రశాంత పరమానంద స్థితిని కనుక్కోగలరు ఎవ్వరైనాసరే. వారు అపుడు అంతరంగ నిశ్చలత పరమప్రశాంతతతో అన్ని కార్యాలు విధులు ఎంతో పరిపూర్ణ నైపుణ్యంతో నిర్వర్తిస్తారు. జీవితం అంటేనే ఒక ఆటగా పూర్ణంగా ఆనందించవలసినది. మనసంతా కేంద్రీకృతమై ఎంతో ఉల్లాసంగా చురుగ్గా అనంతమైన గ్రహింపుతో సర్వ శక్తివంతంగా వుండి పని చేస్తుంది. జ్ఞానం, పనులు యీ రెండింటి మధ్య పరిపూర్ణ సమన్వయం వుంటుంది.

తనకు తాను తెలుసుకోవడం కన్నా మించిన బాధ్యత యెవరికైనా మరేదీ లేదు, ఉండదు. ఇదే మానవుడిగా, మానవుడు సాధించాల్సిన ఒకే ఒక స్థితి, గమ్యం, ఉద్ధేశ్యం, అవసరము. మానవులు కోరుకునే, అనుకునే మిగిలినవన్నీ మిధ్య, భ్రమ, భ్రాంతి మాత్రమే. ఉన్నట్లు, నిజమైనట్లు సత్యంగా అంతా అన్నీ గోచరిస్తాయి, కానీ యేమీ, యేవీ లేనివే. ఇది సత్యం. జాగ్రత్ సుషుప్తి స్వప్న యే అవస్తల్లోనైనా యెవరైనా 'నేను ఉన్నాను' అంటారు గానీ 'నేను లేను' అనరు. అనలేరు యెప్పుడూ.

అణువులోనైనా, ఆకాశంలోనైనా 'నేను' ఉంది. చెప్పవలసి వస్తే 'నేను' అణువు, 'నేను' ఆకాశం, 'నేను' చెట్టు, 'నేను' పర్వతం, 'నేను' పులి......యిట్లానే చెప్పడం జరుగుతుంది. 'నేను' లేనిది యేమీ లేదు, ఉండదు. అదే సర్వాంతర్యామి, నీవు, అందరూ, ఆన్నీ.....నీ స్వరూపమే. ఇది గ్రహించితే పరిమితమైన ప్రేమ, పూర్ణ విశాలమైన విశ్వప్రేమ అవుతుంది.

ప్రపంచం ,దేశం, కాలం అహంకారమే, అహంకారానికే. ప్రపంచ విషయాలు వస్తువులు బంధాలు ఆన్నీ అహంకారానికే. ఇవన్నీ వస్తూ,పోతూ మారుతూ వుండేవే. శాశ్వతం కాదు, సత్యం కాదు. సదా అన్ని కాలాలలో(కాలరహితంగా), సర్వత్రా అన్ని దేశ ప్రదేశాలలో(దేశరహితంగా) మార్పు లేనిదిగా పరిపూర్ణంగా అనంత శక్తిగా, మౌనంగా, చైతన్యంగా, బ్రహ్మానందంగా, ఉండేదే 'నేను'

దానినే ఉన్నది, సత్, ఆత్మ, పరంబ్రహ్మం, పరమేశ్వరుడు, నారాయణుడు, శ్రీహరి.......యిలా యెన్నో, అన్ని పేర్లూ, యే పేరయినా దానికే, దానిదే. దానికంటే వేరుగా యేదీ లేదు, ఉండదు.


ప్రపంచం(ఆబ్జెక్ట్), అహంకారం(సబ్జెక్ట్), లేనివే. చూచే అహంకారం వలననే వున్నట్లు వున్న ప్రపంచం కనిపిస్తున్నది. ఈ అహంకారాం పైనే గురిపెట్టి 'నేనెవరు? విచారణలో ' సత్ అయిన 'నేను' ను కనుక్కోగలము. భగవాన్ శ్రీ రమణ మహర్షి అనంతమైన ఓర్పుతో అనుగ్రహంతో బోధించిన యీ మార్గం యెవరికైనా అనుకూలమే, సాధన చేయగలిగేదే, సులభమైనదే, ఫలితాన్ని అతిమ విజయాన్ని తప్పక యిచ్చేదే.

జై శ్రీ రమణాయ నమః

మూలం : నీవేవరివో నువ్వు కనుక్కో

రచయత : ఏ. ఆర్. నటరాజన్

తెలుగు అనువాదం :శ్రీ రమణానుగ్రహి