Tuesday, January 12, 2010

కర్మ సూత్రం –వివేక వాణి




కర్మ సూత్రం విషయంలో హిందువులే కాక బౌధ్ధులు, జైనులు, అందరూ ఏకాభిప్రాయులవుతున్నారు. జీవం నిత్యమని అందరూ అంగీకరిస్తారు. అది శూన్యం నుండి కలిగిందనడం తగదు ; అది అసంభవం. అటువంటి జీవం ఎందుకూ కొరగాదు. ఎందుకంటే, కాలంలో దేనికి మొదలుందో, కాలంలో దానికీ తుదీ వుంటుంది. జీవం నిన్న ప్రారంభమైతే, రేపు అంతరించి తీరాలి! అప్పుడు సర్వనాశనమే ఫలితార్ధం. జీవం శాశ్వతమై వచ్చేదే! దీన్ని గ్రహించడానికి పెద్ద మేధా శక్తి అవసరం లేదు. ఈనాటి ప్రకృతి శాస్త్రాలన్నీ మనకు తోడ్పడుతున్నాయి. అవి మన ధర్మ శాస్త్రాలకు భౌతిక ప్రపంచంలో నిదర్శనాలు చూపుతున్నాయి. మనలో ప్రతి వాని స్థితి అనంతమైన పూర్వ జన్మల ఫలితార్ధమే అని మీకు తెలుసు.

లోకంలో ఒక బిడ్డ పుట్టాడనుకోండి. అతడు ప్రకృతి చేతిలో నుండి తళుక్కుమని తటాలున వూడిపడటం లేదు. కవులు అలా వర్ణించి ఆనందించినా, ఆనందింతురు గాక! కానీ, బిడ్డ నెత్తి మీద అనంతమైన పూర్వ కర్మ భారముంది. మంచో, చెడో తన పూర్వ కర్మలను పరిష్కరించుకునే నిమిత్తమే, అతడీ లోకానికి వస్తున్నాడు. ఇదే కర్మ సూత్రం. మనలోని ప్రతివాడు, తన అదృష్టానికి తానే కర్త అవుతున్నాడు. ఈ సూత్రం ‘ విధి వ్రాత ‘, ‘ దైవ సంకల్పం ‘ అనే వాదాలను ఎగురగోట్టేస్తోంది. ఈ సూత్రమే భగవంతునికీ, మానవునికీ సమాధానం కూర్చడానికి ఆధారమవుతోంది. మన దుఃఖాలకు మనమే బాధ్యులం ; ఇంకెవరూ కారు. కార్య రూప ఫలం మనమే ; కారణమూ మనమే. అందువల్లే, మనం స్వతంత్రులం అనడం.

నేను దుఃఖినైతే, ఆ దుఃఖం నేను తెచ్చి పెట్టుకున్నదే. నేను తలచుకుంటే, సుఖవంతుడనుగా మారగల ననడానికి అదే నిదర్శనం. నేను దుష్టుడనైతే అదీ నా కర్మ ఫలమే. కాబట్టి నేను తలపెడితే పవిత్రుడిని కాగలననడానికి రుజువు కూడా అదే. నరుని ఇచ్ఛా శక్తి పరిస్థితులన్నింటికీ అతీతమై వొప్పుతోంది. దీని ముందు అంటే, నరునిలో వున్న బలిష్టం, మహత్తరం, అఖండం అయిన ఇఛ్ఛాస్వాతంత్ర్యాల ఎదుట, ప్రకృతి కూడా జోహారనవలసిందే ; తల వంచి దాస్యం చేయవలసిందే. కర్మ సూత్రం యొక్క మహిమా ఇలాంటిది సుమండీ!!

(
వివేకానంద- హిందు మతం పుస్తకం నుండి )

(జనవరి పన్నెండు వివేకానంద జయంతి సందర్భంగా....)

2 comments:

Anonymous said...

చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదములు.

Kalpana Rentala said...

@ అనానిమస్ గారు, అప్పారావు శాస్త్రి గారు వివేకవాణి మీకు నచ్చినందుకు సంతోషం.