Tuesday, December 29, 2009

మహా మౌని, భగవాన్ రమణులు !







ఇరవైశతాబ్దం లో ఇలలో జన్మించిన అవతార పురుషులు, సద్గురువుల్లో అగ్రగణ్యులు భగవాన్ రమణ మహర్షి. ఆయన జీవిత విశేషాల గురించి , ఆయన బోధనల గురించి ప్రత్యేకం గా రాయాల్సిన పని లేదు. శివుడు గరళాన్ని సేవించి గరళకంఠుడైనాడంటే నమ్మశక్యం కాదు మనకు. అది నిరూపించటానికా అన్నట్లు పదహారవ ఏట పూర్వాశ్రమంలో వెంకట్రామన్ నామధేయులైన భగవాన్ మృత్యు అనుభవం పొందారు. ఆ అనుభవం నుండి ఆయన మృత్యుంజయుడైనారు.1907 లో కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని ఆయనను దర్శించి “ రమణ” అని పిలిచారు. అప్పటినుంచి ఆయన రమణ మహర్షి అయ్యారు. రమణ అంటే “ మధుర మూర్తి “ అని అర్ధమట. ఆ పేరు ఆయనకు ఎంత బాగా అమరిందో! గణపతి ముని ఆయనకు రమణ అని నామమిడితే , రమణులు ఆయనను “ నాయనా” అని సంబోధించారు. అప్పటినుంచి కావ్యకంఠ గణపతి ముని ని “నాయన” అని సర్వులూ వ్యవహారంలో ఆత్మీయంగా, ఆప్యాయంగా పిలుచుకునేవారు.


అరుణాచల గుహల్లో నివసించినప్పుడు భగవాన్ కి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం కలగకపోవటంతో ఎక్కువ మాట్లాడలేదు. మహర్షి అనంత శక్తివంతమైన మౌనంలోనే ఆశ్చర్యకరంగా భక్తులకు సంశయ నివారణ అయ్యేది. ఆ తర్వాత కూడా భగవాన్ అధిక సమయం మౌనంగా వుంటూ మానవ మాతృడిగా వ్యవహరించారు. ఆయనది మాట్లాడని మామూలు మౌనం కాదు. మహామౌనం. ఆ మహా మౌనమే విస్తారమైన జ్నాన బోధ. రమణుల సమస్త సంభాషణం కూడా “ నిన్ను నీవు తెలుసుకో” తో మొదలై దానితోనే పూర్తవుతుంది. కోతి, కుక్క, నెమలి లాంటి సమస్త జంతుజాలాన్ని మీరు అని గౌరవంగా సంబోధించి ప్రేమించి అందరిపై తమ అనుగ్రహాన్ని ప్రసరింపచేసిన కరుణామూర్తి. కుల, మతాలు, ఆచారాలు, మూఢ నమ్మకాలు మొదలైన అనవసరమైన వాటిని త్యుజించి నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏమిటో తన జీవిత విధానంతో చూపించారు భగవాన్.

“ నిన్ను నీవు తెలుసుకోకుండా, జగత్తును తెలుసుకోవాలనుకుంటే, అది నిన్ను చూసి వెక్కిరిస్తుంది. నీ మనస్సు యొక్క ఫలితమే, ప్రపంచం. ముందు ఆ మనస్సుని తెలుసుకో. తర్వాత జగత్తును చూడు. అప్పుడు అది ఆత్మ కంటే అన్యంగా, భిన్నంగా , విడిగా లేదని తెలుసుకుంటావు” అంటారు రమణులు.

ఒక భక్తుడు “ ఉద్యోగానికి రాజీనామా చేసి , నిరంతరం భగవాన్ సన్నిధిలో వుండాలనే తలంపు వుంది నాకు “ అని అడిగినప్పుడు భగవాన్ ఇలా సమాధానమిచ్చారు. “ భగవాన్ ఎప్పుడూ మీతోనే, మీలోనే మీరయ్యే వున్నారు. ఈ సత్యా సాక్షాత్కారానికి ఉద్యోగానికి రాజీనామా చేయనవసరం లేదు. ఇంటి నుంచి పలాయనం చేయనవసరం లేదు. పరిత్యాగమంటే వస్త్రాల్ని మార్చడం, కుటుంబ బండాల్ని బహిష్కరించడం, ఇంటిని, ఇల్లాలిని వదలడం కాదు. కానీ, వాటిపై వున్న కోర్కెల్ని,బంధాల్ని, అనుబంధాల్ని విడుచుటే. ఉద్యోగానికి రాజీనామా చేయవలసి పని లేదు. కానీ, ఈ సమస్త భారాల్ని మోసే భగవంతునితో రాజీపడు. అందరి భారాల్ని మోసే వాడు అతనే. కోర్కెల్ని పరిత్యుజించువాడు విశ్వంలో లీనమై, సమస్త ప్రపంచాన్ని ప్రేమించగలుగుతాడు. ప్రేమ, వికాసం, అనురాగం కలిగివుండటం నిజమైన దైవభక్తుని లక్షణాలు. పరిత్యాగం కంటే . ఎందుకంటే, సన్నిహితమైన తన బంధాన్ని, ప్రేమను, జాతి-మాట-కుల పరిమితులను దాటుటే, వాటిని అధిగమించుటే నిజమైన పరిత్యాగం.

సన్యాసి తన వస్త్రాల్ని, ప్రపంచాన్ని, ఇంటిని విసర్జిస్తున్నాడంటే, విరక్తి వల్ల కాదు. అట్లా చేయడం కానీ, తన చుట్టూ వున్న ప్రపంచాన్ని ప్రేమించి, సేవించాలనే కోరికతో అలా పరిత్యాగం చేస్తాడు. ఆ వికాసం కలిగినప్పుడు , తాను ఇంటి నుండి పారిపోతున్నాననే భావన వుండదు. కానీ, అది చెట్టు నుంది రాలిపోయిన పండు వలె సహజంగా జరుగుతుంది. పరిపక్వత రానంత వరకూ ఇల్లు , ఉద్యోగం వదులుట తెలివితక్కువ తనం.” అని ఎంతో సమగ్రంగా, వివరంగా అరటిపండు వొలిచి చేతిలో పెట్టినట్లు చెప్పారు భగవాన్.

రమణుల జన్మదినం డిసెంబర్ 30 , 1879.రమణుల జయంతి సందర్భంగా ఆయన బోధనల నుంచి కొన్నింటిని స్మరించి తరిద్దాము.ఆయన బోధనల గురించి తెలుగు లో ప్రత్యేక బ్లాగులే వున్నాయి. వాటిల్లో ఇంకా మంచి సమాచారం లభిస్తుంది. వాటిని ఇక్కడ చూడండి.